జనసేన టార్గెట్ ఆ మంత్రులేనా?

Thu Aug 18 2022 07:00:01 GMT+0530 (IST)

Are those ministers the target of jana sena?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించడం కోసమే ప్రత్యేకంగా వైఎస్సార్సీపీలో ఒక బృందం ఉందని జనసేన పార్టీ నేతలు చెప్పేమాట. వీరిలో గుడివాడ అమర్‌నాథ్ అంబటి రాంబాబు దాడిశెట్టి రాజా పేర్ని నాని కురసాల కన్నబాబు వంటి కాపు నేతలు ఉన్నారని అంటున్నారు. గతంలో ఇదే విషయంపైన పవన్ కల్యాణ్ కూడా తనను కేవలం కాపు నేతలతోనే విమర్శించనక్కరలేదని.. మిగిలినవాళ్లతోనూ విమర్శించేలా చేయొచ్చని సీఎం వైఎస్ జగన్‌ను ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో పదేపదే పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాపు మంత్రులు నేతలను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనిచ్చేది లేదని జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానులు కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నేతలంతా పవన్ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారని అంటున్నారు. తాము కూడా చిరంజీవి పవన్ అభిమానులమేనని అలాగే కులం కూడా ఒకటేనని ప్రాధేయపడటంతోనే కాపు నేతల్ని గెలిపించామని పవన్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

అయితే ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తున్న ఈ కాపు మంత్రుల్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి గట్టి బుద్ధి చెబుతామని పవన్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. తమ దయతోనే గత ఎన్నికల్లో ఈ మంత్రులు గెలుపొందారని.. మెగాభిమానులమని.. తాము కూడా కాపులేమనని చెప్పుకోవడం వల్లే వీరికి కాదనలేక ఓట్లేశామని చెబుతున్నారు. కానీ వీరు ఇప్పుడు పవన్‌పై చేస్తున్న విమర్శలు చివరకు పేర్ని నానిలాంటివాళ్లు కులాన్ని కూడా దూషిస్తూ మాట్లాడుతుండటాన్ని పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబు బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ లకు వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తామని.. తద్వారా పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో వీళ్లకు రుచి చూపిస్తామని పవన్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఘాటు హెచ్చరికలే జారీ చేస్తున్నారు.

అలాగే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని కూడా స్థాయిని మించి పవన్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడని కొడాలి నానిని కూడా వచ్చే ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని తేల్చిచెబుతున్నారు.

గత ఎన్నికల్లో వీరంతా తమను ఉపయోగించుకోవడానికి ఎలాంటి సమావేశాలు పెట్టారో.. తాము కూడా అలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి వీరి వ్యవహారాన్ని అభిమానులు ప్రజల ముందు ఎండగడతామని.. తద్వారా వీరిని చిత్తుగా ఓడిస్తామని అంటున్నారు.