Begin typing your search above and press return to search.

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త అభ్యర్థులు వీరేనా?

By:  Tupaki Desk   |   27 March 2023 6:00 PM GMT
వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త అభ్యర్థులు వీరేనా?
X
ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడ్డారని వారిని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో.. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.

కాగా ఫోన్‌ ట్యాపింగ్, నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి తమ సొంత ప్రభుత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం వారిద్దరిని నియోజకవర్గాల ఇంచార్జులుగా తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాని కి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ని ఇంచార్జి గా నియమించింది. అలాగే ఆనం రాంనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డిని ఇంచార్జి గా నియమించింది.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలతోపాటు ఇప్పుడు మరో ఇద్దరు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండకు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరికి కొత్త ఇంచార్జులను వైసీపీ అధిష్టానం నియమించనుందని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే గా ఉన్న తాడికొండకు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ను సమన్వయకర్తగా నియమించింది. ఆ తర్వాత ఆయనను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్తగా కత్తెర సురేష్‌ కుమార్‌ ను నియమించింది. కత్తెర సురేష్‌ భార్య హెనీ క్రిస్టీనా ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్నారు.

ఈ నేపథ్యంలో తన నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే గా ఉండగా అదనపు సమన్వయకర్త పేరుతో ఇంకో వ్యక్తిని నియమించడాన్ని ఉండవల్లి శ్రీదేవి గతంలోనే తప్పుబట్టారు. ఈ విషయంలో ఆమె, ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పూర్తి గా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో వచ్చే ఎన్నికల్లో కత్తెర సురేష్‌ లేదా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరిలో ధనుంజయరెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడుగా నియమించింది. గతంలోనే మేకపాటి ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ధనుంజయ్‌ రెడ్డి అనే వ్యక్తిని తన నియోజకవర్గంలో పరిశీలకుడిగా పెట్టడమేంటని మండిపడ్డారు. ఇప్పుడు క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడ్డారని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో ధనుంజయ్‌ రెడ్డి వైసీపీ కొత్త ఇంచార్జి అని చెబుతున్నారు. లేదా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతిని ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జిగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

నెల్లూరు రూరల్, వెంకటగిరి, తాడికొండలకు గతంలోనే నియోజకవర్గ ఇంచార్జిలను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉదయగిరికి కొత్త ఇంచార్జిని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి నేడో, రేపో వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు ఇస్తుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.