వైసీపీ హైకమాండ్‌లో రివ్యూ రైటర్లు ఉన్నారా?

Fri May 13 2022 22:00:01 GMT+0530 (IST)

Are there review writers in the YCP High Command?

ఔను! ఇప్పుడు సర్వత్రా ఇదే మాట వినిపిస్తోంది. ఒక సినిమాకు రివ్యూ రాయడం అంటే.. ఒక ఆర్ట్. ఇది రాసేందుకు.. ఒకింత గ్రహణ శక్తి.. ఆలోచన.. సినిమాను ఆద్యంతం గుర్తు పెట్టుకోవడం.. డైలాగులు మరిచి పోకుండా.. ఉండడం.. ఇలా అన్ని కోణాల్లోనూ.. ఒక సినిమా కు సంబంధించిన రివ్యూ రాయాలంటే.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మూవీ కి రివ్యూలు రాసేవారంటే.. ఒకింత క్రేజ్ కూడా ఉంది. టాలీవుడ్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది.అయితే.. ఇప్పుడు రివ్యూ రైటర్లను మించిపోయిన.. రివ్యూలు ఇచ్చేస్తున్నారు.. వైసీపీకి చెందిన కీలక నాయకుడు.. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి. ఆయన తాజాగా విడుదలైన.. మహేష్ బాబు మూవీ 'సర్కారువారి పాట'కు సంబంధించి ఓ రివ్యూరాసేశారు. దానిని తన ట్విట్టర్‌లోనూ పోస్టు చేసేశారు. ఈ మూవీని హైలెట్ చేస్తూ.. ఆయన కొన్ని వ్యాఖ్యలురాశారు.

''సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట' బాగుంది. పేదలు పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు''.  అని సాయిరెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటివరకు సాయిరెడ్డి చేసిన ట్వీట్లను గమనిస్తే.. ఎక్కడా ఇలాంటి సినిమాల గురించి ప్రస్తావన ఉండదు.

కేవలం రాజకీయాలు.. నేతలు.. విధానాలు.. ఇవే కనిపిస్తాయి. కానీ అనూహ్యంగా మహేష్ బాబు సినిమాపై ఆయన తొలిసారి ఇలా రివ్యూ రాశారంటే.. వైసీపీ హైకమాండ్‌లోనూ రివ్యూ రైటర్లు ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోతే.. తాజాగా వచ్చిన సర్కారు పాట సినిమాపైనే.. సాయిరెడ్డి రివ్యూ ఎందుకు రాశారు.. అనేది కూడా ప్రశ్న.

ఎందుకంటే.. ఘట్టమనేని కుటుంబం.. టీడీపీకి మద్దతు ఇస్తోంది. గత ఎన్నికల్లో ఈ కుటుంబానికి చెందిన అల్లుడు.. గెలిచేలా.. వారు చక్రం తిప్పారనే పేరుంది. మరి ఇలంటి సమయంలో అనూహ్యంగా మహేష్ సినిమాకు సాయిరెడ్డి రివ్యూ రాయడం ఏంటి? అనేది ప్రశ్న.

దీనికి ఏకైక సమాధానం.. సర్కారు వారి పాట సినిమాలో.. వైసీపీ నేతలు.. జగన్ కోసం రాసిన.. జగన్ తన పాదయాత్ర లో చేసిన డైలాగులు ఉన్నాయి. ''నేనే ఉన్నాను.. నేను విన్నాను'' తరహా డైలాగులు అన్నమాట. బహుశ అందుకే.. సాయిరెడ్డి తీరిక చేసుకుని ఈ రివ్యూ రాసి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. ఇక నెటిజన్ల నుంచి తమదైన శైలిలో స్పందనలు వస్తుండడం గమనార్హం.