Begin typing your search above and press return to search.

సోముకు డేంజర్‌ బెల్స్‌ మోగినట్టేనా?

By:  Tupaki Desk   |   20 March 2023 7:00 PM GMT
సోముకు డేంజర్‌ బెల్స్‌ మోగినట్టేనా?
X
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై వేటు తప్పదా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నిరాశజనక ఫలితాలు నమోదు చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ తాజాగా పోగొట్టుకుంది. పీవీఎన్‌ మాధవ్‌ ఉత్తరాంధ్ర సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. కనీసం ఆయన డిపాజిట్టు కూడా దక్కించుకోకపోవడం, చెల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లు సాధించడం బీజేపీ వర్గాలనే నివ్వెరపరిచిందని అంటున్నారు.

అలాగే ఇటీవల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కి రాజీనామా చేసి టీడీపీ లో చేరారు. ఆ సందర్భంగా ఆయన సోము వీర్రాజు పైనే తీవ్ర విమర్శలు చేశారు. సోము వ్యవహార శైలి వల్లనే తాను బీజేపీకి రాజీనామా చేయాల్సి వస్తోందని బహిరంగంగానే విమర్శలు సంధించారు.

అదేవిధంగా ఇటీవల పార్టీలో సోము వీర్రాజు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డ కొంతమంది నేతలు విజయవాడ లో సమావేశమయ్యారు. సోము వీర్రాజు ను పార్టీ అధ్యక్షుడి గా తప్పించాల్సిందేనని తీర్మానించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ఏపీ బీజేపీ వ్యవహారాలు చూసే తరుణ్‌ చుగ్, సునీల్‌ ధియోధర్‌ తదితర నేతలను కలిశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజును తప్పించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సైతం ఏపీ బీజేపీ తీరు పై ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. బందరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన పవన్‌ కేంద్రంలో బీజేపీ పెద్దలు సహకరించినా రాష్ట్ర స్థాయి నేతలు మిలియన్‌ మార్చ్‌ కు ముందుకు రాలేదని తప్పుబట్టారు. పరోక్షంగా పవన్‌.. సోము వీర్రాజు వ్యవహార శైలినే తప్పుబట్టారని చెబుతున్నారు.

మరోవైపు ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజునే 2024 ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తర్వాతే బీజేపీ నేతల అసంతృప్తి, కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పు వంటివన్నీ చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిరాశజనక ఫలితాలు నమోదు చేయడంపై సోము వీర్రాజు ను తొలగిస్తారనే చర్చ ఊపందుకుంది.

పైకి విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ వైసీపీతో బీజేపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందన్న అపప్రథ ఉందని అంటున్నారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుపై బీజేపీ అధిష్టానం దృష్టి పెడుతుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.