మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా ఈ సినిమా గ్రాస్ వసూలు చేసింది. రూ.200 కోట్లు షేర్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తెలంగాణలోని వరంగల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఫ్యామిలీ ఫ్యాన్స్ తప్ప.. చిరంజీవి జోలికి ఎవరొచ్చినా మేం ఊరుకోం అని రామ్ చరణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తాము క్వైట్ గానే చెబుతున్నామని.. మేము చిరంజీవి అంత క్వైట్ కాదని.. ఇదే విషయాన్ని క్వైట్ గానే చెబుతున్నామని చరణ్ ఘాటుగా స్పందించడం గమనార్హం. చిరంజీవి చాలా క్వైట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చారని అన్నారు. తన తండ్రి మౌనం వీడి గట్టిగా ఉంటే ఏమవుతుందో ఎవరికీ తెలియదని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తాను కానీ తమ అభిమానులు కానీ తన తండ్రి అంత సౌమ్యులం కానీ హెచ్చరించారు.
‘‘చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు అభిమానులు మాత్రమే అనగలరు. నాన్న మౌనంగా సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన సైలెంట్గా ఉంటేనే ఇలా ఉంది. అదే ఆయన మౌనం వీడి మాట్లాడితే ఏం అవుద్దో ఎవరికీ తెలియదు. గుర్తుపెట్టుకోండి.. ఆయన సైలెంట్గా ఉంటారేమోకాని మేం (ఫ్యాన్స్) ఉండం. ఆయన్ను ఏమైనా అంటే మేం ఊరుకోమని క్వైట్ గానే చెబుతున్నా’’ అని రామ్చరణ్ అన్నారు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవనే చర్చ టాలీవుడ్ లో సాగుతోంది. ఇంతకీ.. ఈ కామెంట్స్ రామ్ చరణ్ ఎందుకు చేశారు..? ఎవరినుద్దేశించి చేశారని అటు రాజకీయాల్లో ఇటు టాలీవుడ్ లో చర్చ సాగుతోంది.
అయితే ఇటీవల ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనే రామ్ చరణ్ ఆమెకు హెచ్చరికలు జారీ చేశాడని అంటున్నారు. ఇటీవల రోజా మెగా ఫ్యామిలీ ప్రజలకు ఏం సేవ చేయలేదని మెగా ఫ్యామిలీ అంటే భయం తప్ప ప్రజలకు ప్రేమ లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ముగ్గురూ ఎన్నికల్లో ఓడిపోయారని.. అదే తాను శారద కోట శ్రీనివాసరావు తదితరులం ఎన్నికల్లో గెలిచామని రోజా గుర్తు చేశారు. అలాగే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను నిలబెట్టిన మెగా ఫ్యామిలీ గెలిపించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జబర్దస్త్ నటులతో తమపై మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. రోజా నోటికి మునిసిపాటిటీ కుప్పతొట్టి రోజాకు తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి అసలు తాము పట్టించుకోబోమన్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో రోజాను ఏకిపడేశారు. ఆఖరుకు రోజా కూడా తనను విమర్శిస్తోందని తీసిపడేశారు. ఆఖరుకు నన్ను రోజా కూడా తిడుతోంది.. నా బతుకుచెడ అంటూ రోజాను అవహేళన చేశారు. అంతేకాకుండా ఆమె డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రామ్ చరణ్ సైతం పేర్లు ఎత్తకుండానే రోజాకు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. తన తండ్రి మౌనం వీడితే ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు అనడం ద్వారా తమను రెచ్చగొడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పకనే రామ్ చరణ్ చెప్పేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.