పెరిగిపోతున్న ఏప్రిల్ 3 టెన్షన్

Fri Mar 31 2023 14:03:16 GMT+0530 (India Standard Time)

April 3 Tension in YSRCP Leaders

వైసీపీలో ఏప్రిల్ 3వ తేదీ టెన్షన్ పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతున్న 3వ తేదీ సమావేశానికి మంత్రులు ఎంఎల్ఏలు రీజనల్ కోఆర్డినేటర్లు కో ఆర్డినేటర్లు జిల్లాల అధ్యక్షులంతా హాజరుకావాలని జగన్ తరపున అందరికీ సమాచారం అందింది. దాంతో ఏప్రిల్ 3వ తేదీన జగన్ ఏమి మాట్లాడబోతున్నారు ఏమి చెప్పబోతున్నారనే విషయంపైనే అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. అందరిలో ఇంతటి టెన్షన్ ఎందుకసలు ?ఎందుకంటే మొన్ననే జరిగిన మూడు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో ఓడిపోవటమే. అలాగే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పరాజయమే కారణమంటున్నారు. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వల్లే వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే.

దీనికి చాలామంది మంత్రులు ఎంఎల్ఏలు రీజనల్ కోఆర్డినేటర్లు కో ఆర్డినేటర్లు జిల్లాల అధ్యక్షులకు సంబంధంలేదు. కానీ అంతకుముందు ఓడిపోయిన మూడు పట్టభద్రుల ఎంఎల్సీ స్ధానాలకు మాత్రం చాలామంది మంత్రులు ఎంఎల్ఏలు జిల్లాల అధ్యక్షులదే బాధ్యతుంది.

ఎలక్షనీరింగ్ లో మంత్రులు ఎంఎల్ఏలు జిల్లాల అధ్యక్షులు చూపిన నిర్లక్ష్యం లేదా లైటుగా తీసుకోవటం వల్లే పార్టీ ఓడిపోయిందని జగన్ బాగా మండుతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలామందికి కచ్చితంగా క్లాసు పీకటం ఖాయమనే చర్చ పెరిగిపోతోంది.

పైగా మంత్రివర్గం ప్రక్షాళన కూడా ఉంటుందనే ప్రచారం వల్ల టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది. ప్రక్షాళనంటే ఉండేదెవరు ? ఊడేదెవరు అనే విషయంలో ఇప్పటికే బాగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి అనేక అంశాలతో పాటు గడపగడపకి వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం ఫీడ్ బ్యాక్ రిపోర్టు కూడా చదివి వినిపిస్తారని సమాచారం. సో ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే మీటింగ్ చాలా కీలకమైనదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాబట్టి జగన్ రియాక్షన్ ఎలాగుంటుందో తెలీకే చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తే ఎవరనీ ఉపేక్షించేది లేదనే సస్పెన్షన్ వేటు ద్వారా సిగ్నల్ ఇప్పటికే జగన్ స్పష్టంగా ఇచ్చేశారు. మరి 3వ తేదీన జరగబోయే సమావేశంలో జగన్ ఏమి మాట్లాడుతారో చూడాల్సిందే.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.