Begin typing your search above and press return to search.

ఈ వివాదాస్పద ఐపీఎస్‌ ను ఏపీ డీజీపీగా నియమిస్తున్నారా?

By:  Tupaki Desk   |   24 Jan 2023 11:00 AM GMT
ఈ వివాదాస్పద ఐపీఎస్‌ ను ఏపీ డీజీపీగా నియమిస్తున్నారా?
X
వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి, ఏపీ సీఐడీ చీఫ్‌ గా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌ ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సునీల్‌ కుమార్‌ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తనను అరెస్టు చేసిన సమయంలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.

మరోవైపు ఐపీఎస్‌ అధికారిగా ఉంటూ ఒక క్రిస్టియన్‌ సంస్థను నడుపుతున్నారని.. దీనికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయని బీజేపీ నేతలతో సహా మరికొందరు సైతం కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా పలు సమావేశాల్లో సునీల్‌ కుమార్‌ వ్యాఖ్యలు చేశారని కూడా కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి.

జగన్‌ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేయడం.. వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, ప్రతిపక్ష నేతల వ్యవహారాలను తెలుసుకోవడానికి నిఘా ఏర్పాటు చేయడం వంటి పనులు కూడా సునీల్‌ కుమార్‌ చేశారని టీడీపీ నేతలు సైతం విమర్శలు చేశారు.

ఈ క్రమంలో ఇటీవల జగన్‌ ప్రభుత్వం సునీల్‌ కుమార్‌ కు డీజీగా పదోన్నతి కల్పించడం విశేషం. ఏపీ సీఐడీ చీఫ్‌ గా ఉన్న సునీల్‌ కుమార్‌ ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేయడం సంచలనానికి కారణమైంది. ఆయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది,

సునీల్‌ కుమార్‌ గత మూడేళ్లుగా సీఐడీకి చీఫ్‌ గా ఉన్నారు. నెల రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం నుంచి డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) హోదాలో పదోన్నతి పొందారు.

కాగా సునీల్‌ కుమార్‌ తదుపరి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) కావచ్చునని టాక్‌ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ డీజీపీగా సునీల్‌ కుమార్‌ ఉంటారని ప్రచారం సాగుతోంది. సునీల్‌ కుమార్‌ అయితే ప్రతిపక్ష నేతలను సమర్థంగా అణచివేస్తారని.. తద్వారా ఎన్నికల్లో తమకు లబ్ధి కలుగుతుందని వైసీపీ భావనగా ఉందని అంటున్నారు.

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ సునీల్‌ కుమార్‌ కూడా ట్వీట్‌ చేయడం గమనార్హం. తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు డీజీగా పదోన్నతి ఇచ్చినందుకు, మూడేళ్లపాటు ఏపీ సీఐడీ చీఫ్‌ గా కొనసాగించినందుకు సీఎం జగన్‌ కు సునీల్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సునీల్‌ ఏపీ డీజీపీగా ఉంటారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తమ ప్రభుత్వ కనుసన్నుల్లో నడిచే ఆయనైతే ఎన్నికల్లో తమకు లాభం చేకూరుతుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.