Begin typing your search above and press return to search.

సిమ్లా యాపిల్ కంటే ఏపీ యాపిల్ సూపరంట

By:  Tupaki Desk   |   5 Dec 2015 9:07 AM GMT
సిమ్లా యాపిల్ కంటే ఏపీ యాపిల్ సూపరంట
X
యాపిల్ పండ్లు అంటే అయితే సిమ్లా.. లేదంటే జమ్మూకశ్మీర్ లాంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారని అనుకుంటారు.అయితే.. హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెల్యులర్.. మాలిక్యులర్ బయలజీ సెంటర్) శాస్త్రవేత్తలు ఆంధ్రా.. ఒడిశాలలోని కొన్ని ప్రాంతాల్లో యాపిల్ సాగు చేయాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలు చేపట్టి.. 2014లలో లంబసింగి.. చింతపల్లి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేస్తున్నారు.

అనుకున్న దాని కంటే మిన్నగా యాపిల్ పంట సాగుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 40 మొక్కల్ని నాటారు. వాటి ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నారు. వీటిల్లో ఐదు మొక్కల్ని పండ్ల కోసం కేటాయించారు. ఈ ఐదు మొక్కలకు సంబంధించి ఆరు యాపిల్ కాయలు పండాయి. దీంతో.. వీటి రుచిని పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్తలు చింతపల్లికి వెళ్లారు. వాటి రుచిని స్వయంగా చూశారు.

ఈ యాపిళ్ల రుచి.. సిమ్లా యాపిల్ కంటే బాగుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రుచిలోనే కాదు.. రంగు.. సైజ్ లోనూ ఏపీ యాపిల్ అదిరిపోయిందని.. నిజానికి రెండేళ్ల వ్యవధిలోనే కాపు కాయటం విచిత్రమైన అంశమని సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే యాపిల్.. చింతపల్లి (ఏజెన్సీ ప్రాంతం) వాతావరణం బాగా సూట్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము అనుకున్న దాని కంటే బాగా విజయవంతం కావటంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు ఏపీ యాపిల్ మీద మరింత ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. రానున్న రోజుల్లో మార్కెట్లోకి వచ్చే ఏపీ యాపిల్ అదరగొట్టటం ఖాయమన్న మాట.