Begin typing your search above and press return to search.

ఏజెన్సీ ఏడు సీట్లలో వైసీపీకి ఎదురుగాలి...?

By:  Tupaki Desk   |   25 Jan 2023 8:00 AM GMT
ఏజెన్సీ ఏడు సీట్లలో వైసీపీకి ఎదురుగాలి...?
X
ఏపీలో ఏజెన్సీ సీట్లు ఏడు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లూ ఈ సీట్లు వైసీపీకే వచ్చాయి. మొత్తానికి మొత్తం గిరిజనులు వైసీపీకి జై కొట్టారు. వైసీపీ కూడా వారి రుణం ఉంచుకోలేదు. అధికారంలోకి వచ్చాక ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టింది. ఎస్టీ కమిషన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి క్యాబినెట్ హోదాతో దానిని ఒకరికి అప్పగించింది. అలాగే ఇతర పార్టీ బాధ్యతలు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించింది.

అంతవరకూ బాగానే ఉన్నా గిరిజనం మాత్రం ఈసారి ఎందుకో ఫ్యాన్ పార్టీ పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఏజెన్సీలో తమకు ఏమి మేలు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఏజెన్సీలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పదని అంటున్నారు. లేటెస్ట్ గా జరిపిన ఒక సర్వే ఆ విషయం తేటతెల్లం చేస్తోంది.

నిజానికి ఎస్టీ నియోజకవర్గాలలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం వహిస్తే తరువాత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ మొత్తానికి మొత్తం సీట్లను తన ఖాతలో వేసుకుంది. అయితే 2014లో తెలుగుదేశానికి పోలవరం నియోజకవర్గం దక్కింది. 2019లో ఆ సీటూ పోయింది. ఇలా ఏడింట విజయం సాధించి ధీటుగా నిలబడిన వైసీపీకి 2024లో సంగతేంటి అన్న ప్రశ్న ముందుకు వస్తోంది.

ఇక తాజాగా మన్య సీమ లోని ఏడు సీట్లకు సంబంధించి చేసిన సర్వేలో వైసీపీకి పెద్ద ఎత్తున దెబ్బ పడబోతోంది అని తేలింది. గత ఎన్నికల్లో యాభై శాతానికి పైగా ఓట్ల షేర్ వైసీపీకి వస్తే ఈసారి అది కాస్తా 44.25 శాతంగా పడిపోయింది. అంటే అయిదు శాతం తగ్గింది అన్న మాట. ఇక తెలుగుదేశానికి 39.39 శాతం ఓట్ల షేర్ ఉందని సర్వే పేర్కొంది. జనసేన అనూహ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పుంజుకున్నట్లుగా సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదెలా అంటే ఆ పార్టీకి ఏకంగా 8.19 శాతం ఓట్ల షేర్ ఉందని తెలుస్తోంది.

అంటే విడివిడిగా తెలుగుదేసం జనసేన పోటీ చేస్తే వైసీపీ ఇక్కడ విజయం సాధించవచ్చేమో కానీ రెండు పార్టీలు కలిస్తే మాత్రం 47 శాతం పైగా ఓట్లను దక్కించుకుని వైసీపీని ఓడించవచ్చు అన్నది తాజాగా ట్రకార్ సర్వే చెప్పిన వాస్తవాలు. ఈ ట్రాకర్ సర్వే చేసింది ఎవరో తెలుగుదేశం అనుకూల వర్గం కాదు, సాక్షి మాజీ ప్రతినిధి, వైఎస్సార్ వీరాభిమాని అయిన దినేష్ రెడ్డి చేశారు.

దాంతో ఈ సర్వే చెప్పే పచ్చి నిజాలు అధికార పార్టీ కూడా దిగమింగాల్సి వస్తుందని అంటున్నారు. ఆయన పీపుల్స్ పల్స్ పేరిట ఒక సంస్థను ఇటీవల స్థాపించారు. ఆయన దాని ద్వారా ఫస్ట్ ఫస్ట్ ట్రాకర్ పోల్ సర్వే చేసింది. అందులో చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు నమోదు అయ్యాయని అంటున్నారు.

ఈ సర్వే జనవరి 16 నుంచి 21 వరకూ మొత్తం 35 పోలింగ్ బూతుల నుంచి 700 పైగా శాంపిల్స్ తీసుకుని సర్వే జరిపారు. రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, పాలకొండ, కురుపాం, పోలవరం లలో జరిపిన సర్వే ఇది. విడిగా పోటీ చేస్తే వైసీపీకి తక్కువ మెజారిటీతో ఆరు సీట్లు గెలుచుకుంటే పోలవరం తెలుగుదేశం పరం అవుతుంది అని తేలింది. అదే జనసేన కలిస్తే మాత్రం ఫలితాలు మొత్తం తారు మారు అవుతాయని కూడా సర్వే బట్టి తెలుస్తోంది. మొత్తానికి ఏజెన్సీలో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.