Begin typing your search above and press return to search.

సుప్రీంలో ఎన్నికల కేసు.. మరోధర్మాసనానికి బదిలీ అయ్యిందెందుకు?

By:  Tupaki Desk   |   25 Jan 2021 4:17 AM GMT
సుప్రీంలో ఎన్నికల కేసు.. మరోధర్మాసనానికి బదిలీ అయ్యిందెందుకు?
X
ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటం.. అందుకు ప్రభుత్వం ససేమిరా అనటం తెలిసిందే. దీనిపై తుది నిర్ణయం కోసం సుప్రీంను ఏపీ సర్కారు ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును జస్టిస్ లావు నాగేశ్వరరావు.. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్.. జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ముందు లిస్టు చేశారు. అయితే.. ఆదివారం ఈ కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. జస్టిస్ హ్రషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకిలా జరిగింది? కారణం ఏమిటి? ఉన్నట్లుండి ధర్మాసనం మార్పు వెనుక ఏం జరిగింది? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఏపీ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సైతం పిటిషన్ దాఖలు చేయటం.. ఈ కేసు విచారణ కూడా సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిషన్ కౌల్.. హ్రషికేశ్ రాయ్ ల ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. రెండు కేసులు ఒకే అంశానికి కావటంతోనే ఇలా మార్పులు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. సుప్రీంకోర్టు న్యాయవాద వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మాసనం మార్పు వెనుక కారణం మరోలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల సంఘం తరఫున కేసును డ్రాఫ్ట్ చేసిన న్యాయవాది ఒకరు తాను గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన వద్ద జూనియర్ గా పని చేశారు. తన కేసు ఆ బెంచ్ ముందుకు వెళితే.. సదరు న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనే అవకాశం ఉన్నందున వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి విన్నవించుకోవటం వల్లే ఈ మార్పు చోటు చేసుకొని ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే ధర్మాసనం మారటానికి కీలక కారణమని చెబుతున్నారు.