కొవిడ్ బాధితులకు విరుష్క అండగా.. ఏం చేస్తున్నారో తెలుసా?

Fri May 07 2021 13:00:01 GMT+0530 (IST)

Anushka Sharma Virat Kohli donate Rs 2 cr

కరోనా మహమ్మారి విధ్వంసం దేశంలో కొనసాగుతూనే ఉంది. వాయువేగంతో దూసుకెళ్తున్న కొవిడ్.. లక్షలాది మందిని తన గుప్పిట పడుతోంది. వేలాది మందిని బలి తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4 లక్షల 12 వేల 262 కేసులు నమోదయ్యాయి. 3449 మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 4 లక్షలు దాటడం ఇది వరుసగా మూడో రోజు. ఇటు కేసులు.. అటు మరణాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డు.కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప.. తగ్గట్లేదు. దీంతో.. పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదేతరహా ఆలోచనలు చేస్తున్నాయి. మొత్తానికి దేశంలో ఏ మూల కూడా ప్రజలు ప్రశాంతంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపన్నులను ఆదుకునేందుకు మానవతా వాదులు ముందుకొస్తున్నారు.

ఇప్పటికే సోనూసూద్ వంటి వారు సాధ్యమైనంత మేర బాధితులను ఆదుకుంటున్నారు. తాజాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు కెట్టో వెబ్ సైట్ ద్వారా విరాళాల సేకరణ చేయనున్నట్టు తెలిపారు.

ఇందుకోసం ముందుగా తాము రూ.2 కోట్లను జమ చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఒకరికి మరొకరు అండగా నిలవాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే విరాళాల సేకరణ చెపట్టామని అందరూ తమ వంతుగా సహకారం అందించి కరోనా బాధితులను కాపాడాలని కోరారు.