Begin typing your search above and press return to search.

ఓటీటీల అశ్లీలతపై కేంద్రం హెచ్చరిక

By:  Tupaki Desk   |   20 March 2023 10:25 PM
ఓటీటీల అశ్లీలతపై కేంద్రం హెచ్చరిక
X
ఈ మధ్యన వచ్చిన ఒక వెబ్ సిరీస్ లో మోతాదు మించిన శృంగారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వెబ్ సిరీస్ లో పచ్చి బూతులు మాట్లాడిన వైనంపై ప్రేక్షకులు విమర్శలు గుప్పించారు. అయితే ఓటీటీ కావడం.. ఇన్నాళ్లు దానికి సెన్సార్ ఏవీ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఆ బూతు కంటెంట్ పోస్ట్ అవుతూనే ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఓటీటీల అశ్లీలతపై కేంద్రం తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఓటీటీల ద్వారా సృజనాత్మకత పేరుతో అశ్లీలత , అసభ్య పదజాలాన్ని ప్రభుత్వం సహించదని కేంద్ర సమాచార , ప్రసార , యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరైనా “పరిమితి దాటితే” జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని ఆయన హెచ్చరించారు.

సృజనాత్మకత పేరుతో దుర్వినియోగం చేస్తే సహించేది లేదని కేంద్ర సమాచార మంత్రి ఓటీటీ సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం , అశ్లీల కంటెంట్ పెరుగుతున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి నిబంధనలలో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే, మంత్రిత్వ శాఖ ఆ దిశగా కూడా ఆలోచిస్తుందంటూ అనురాగ్ ఠాకూర్ నాగ్‌పూర్‌లో సంచలన ప్రకటన చేశారు.

ఇంటర్నెట్ ద్వారా వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారం ఇది అవుతుండడంతో దీన్ని ఇప్పటివరకూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా కంట్రోల్ చేయలేకపోయాయి. అయితే ఈ మధ్యకాలంలో అశ్లీలత పెరిగిపోవడం.. ఫిర్యాదులు కేంద్రానికి రావడంతో దీనిపై కేంద్రం దృష్టిసారించింది. "ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సృజనాత్మకత కోసం స్వేచ్ఛ ఇవ్వబడింది, అశ్లీలత ,దుర్వినియోగం కోసం కాదని గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఒక పరిమితిని దాటితే, సృజనాత్మకత పేరుతో దుర్వినియోగం చేస్తే అసభ్యంగా ప్రవర్తిస్తే అస్సలు అంగీకరించం.. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని నుండి వెనక్కి తగ్గుము" అని అనురాగ్ ఠాకూర్ స్పష్టమైన ప్రకటన చేశారు.

ఇటీవల ఇద్దరు తెలుగు అగ్రహీరోలు నటించిన ఓ వెబ్ సిరీస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులోని ఓవర్ శృంగార సీన్లు, బూతు పదాలతో నిండి కుటుంబంతో కలిసి చూడలేరన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే ఓటీటీలను సెన్సార్ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీనిపైనే కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం స్పందించి కఠినచర్యల దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఓటీటీలకు కేంద్రం సెన్సార్ షిప్ విధిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.