వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకు పోతాయ్: కోటం రెడ్డి ఫైర్

Fri Mar 31 2023 18:58:53 GMT+0530 (India Standard Time)

Anti-Amravati forces will be defeated in next elections: Kotam Reddy Fire

వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తున్న శక్తులు కొట్టుకుపోతాయని.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నాడు అమరావతిని ముద్దు అని.. నేడు అమరావతిని వద్దని ఎందుకు అంటున్నారో.. సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందని.. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అది శుక్రవారంతో 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మందడంలో రాజధాని రైతు జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  రైతులకు మద్దతుగా కోటంరెడ్డి పాల్గొన్నారు.



ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ దుష్ట దుర్మార్గానికి ఎదురొడ్డి ఉద్యమిస్తున్నారని  ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందిం చారు. దేశంలోని నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారని అన్నారు.

అమరావతి 29 గ్రామాలది కాదని.. ప్రపంచంలోని కోట్లాది తెలుగు ప్రజలది అని కోటం రెడ్డి వ్యాఖ్యనించారు. అమరావతి అప్పుడు ముద్దు ఇప్పుడెందుకు కాదో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. జగన్ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారని అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోడీ చెబితే అమరావతి ఇక్కణ్నుంచి కదిలే అవకాశం లేదన్నారు. అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైసీపీ ప్రభుత్వం కదిలించలేదని కోటంరెడ్డి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకొనిపోతాయని దుయ్యబట్టారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన దగ్గరి నుంచి వైసీపీలో తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని కోటంరెడ్డి చెప్పారు. అయినా తాను భయపడటం లేదన్నారు.

భావితరాల కోసం అమరావతి రాజధానిని చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అమరావతిని కాలరాశాడని దుయ్యబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయితే అమరావతి నుంచి మట్టి పెళ్ల కూడా కదలదని చెప్తుందో.. ఆ పార్టీలకు అనుకూలంగా ఎన్నికల సునామీ రాబోతుందని కోటంరెడ్డి చెప్పారు. అమరావతికి వ్యతిరేకంగా ప్రయత్నించిన శక్తులు ఆ సునామీలో కొట్టుకుపోవటం ఖాయమని ఉద్ఘాటంచారు.

'దగాపడ్డ రైతులు దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను రాజధాని రైతు జేఏసీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పంచుమర్తి అనురాధ హాజరయ్యారు. బీజేపీ తరఫున సత్యకుమార్ ఆదినారాయణరెడ్డి వల్లూరు జయప్రకాశ్ హాజరుకాగా.. ప్రత్యేక అతిథిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సభలో పాల్గొన్నారు.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.