కొత్త కొత్త వేరియంట్లలో కరోనా .. మాస్కోలో మరో కొత్త వేరియంట్

Thu Jun 17 2021 12:01:39 GMT+0530 (IST)

Another new variant in Moscow

2019 ఏడాది చివరిలో చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. ఓ వైపు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు చాలా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా ముందుకి తీసుకుపోతున్నాయి. ఇజ్రాయిల్ అమెరికా వంటి దేశాల్లో టీకాలు ఇవ్వడం ఇప్పటికే దాదాపుగా  పూర్తి అయ్యింది. అయితే ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ  కొత్త కొత్త వేరియెంట్స్ తో ప్రపంచ దేశాలను ఆందోళనకి గురిచేస్తూనే ఉంది.రష్యాలో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందిందని.. కొత్త స్ట్రెయిన్ వైరస్‌ను కనుగొన్నట్లు గమలేయా నేషనల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కోలో తొలిసారిగా వెలుగుచూడటంతో ఈ వైరస్ కు మాస్కో పేరుతో పిలుస్తున్నామని చెప్పారు. రష్యాలో తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయగా ఈ రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ పై స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందో తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారని గమలేయా నేషనల్ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ వివరించారు. ఈ వైరస్‌పై పరిమిత సమాచారం మాత్రమే ఉందని సుత్నిక్ వ్యాక్సిన్ పనిచేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇదిలా ఉంటే మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 67208 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 2330 మంది మరణించారు. తాజాగా 103570 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 29700313 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 28491670 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 381903 మంది కోవిడ్ తో మృతి చెందారు. ఇక దేశంలో క్రియాశీల రేటు 2.78శాతం ఉండగా రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది.