Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో పేల్చేసిన డ్యామ్ తో ప్రపంచానికి మరో కష్టం

By:  Tupaki Desk   |   8 Jun 2023 12:00 PM GMT
ఉక్రెయిన్ లో పేల్చేసిన డ్యామ్ తో ప్రపంచానికి మరో కష్టం
X
ఎక్కడో ఉక్రెయిన్ - రష్యా మధ్య నడుస్తున్న యుద్ధం ఇప్పటికే ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేసింది. రష్యా దురాశ వందల కోట్ల మందికి తలనొప్పిగా మారగా.. తాజాగా ఈ యుద్ధంలో భాగంగా చోటు చేసుకున్న తాజా పరిణామం ప్రపంచ దేశాలకు మరోసారి వణికేలా చేస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో అతి పెద్దదైన డ్యామ్ లలో ఒకటిగా చెప్పే కఖోవ్కా డ్యామ్ ఒకటి. ఈ డ్యామ్ కింద లక్షలాది ఎకరాల సాగుభూమి ఉంది. పెద్ద ఎత్తున తాగునీరు.. సాగునీరును అందిస్తున్న అతి పెద్ద రిజర్వాయర్ లలో ఒకటిగా చెప్పే ఈ డ్యామ్ ను బాంబులతో కూల్చేయటం తెలిసిందే.

ఈ డ్యామ్ ను కూల్చేసి 48 గంటలు అవుతున్నా.. ఇప్పటివరకు దాన్ని కూల్చింది ఎవరన్న విషయంపై స్పష్టత వచ్చింది లేదు. ఇప్పటికి ఆరోపణల పర్వం నడుస్తోంది. లక్షలాది మందికి కొత్త కష్టంగా మారిన ఈ ఉదంతం.. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకు కొత్త తలనొప్పిగా మారుతుందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. డ్యామ్ పేల్చివేత ఘటన బయటకు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని ఎఫెక్టు పలు దేశాలపై ఇప్పటికే పడిందన్న మాట వినిపిస్తోంది.

అయినా.. ఎక్కడో ఉక్రెయిన్ లో ఒక డ్యామ్ పేల్చేస్తే.. ప్రపంచ దేశాల మీద ప్రభావం ఎందుకు ఉంటుందన్న భావనను మనసులోకి కూడా రానివ్వొద్దు. ఇప్పుడున్న ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంలాంటిది. ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా.. దాని ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. తాజా ఉదంతంలోకి వెళితే.. ఈ డ్యామ్ కింద లక్షలాది ఎకరాలు సాగు చేస్తుంటాయన్న విషయాన్ని ఇప్పటికే చెప్పాం కదా. అలా సాగు చేసే పంటల విషయానికి వస్తే.. గోధుమలు.. బార్లీ.. సన్ ఫ్లవర్ ఆయిల్.. ఇతర ఆహార ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున పండిస్తారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు.

దీని కారణంగా వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. డ్యామ్ కు జరిగిన నష్టంతో.. దీని కింద ఉన్న ఆయుకట్టులో పంట నష్టం వాటిల్లుతుంది. పంట ఉత్పత్తి తగ్గితే.. దాని ప్రభావం ఎగుమతుల మీద పడుతుంది. ధరల మీదా పడుతుంది. డ్యామ్ పేల్చిన వైనం బయటకు వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే.. అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమల ధర పెరగటం మొదలైంది. ఆఫ్రికా.. మధ్యప్రాచ్యం.. ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ అందించే ఆహార ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే ఈ దేశాల మీద ప్రభావం షురూ అయ్యింది.

రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి పెద్దదవుతుందని. అదెలానంటే.. డిమాండ్ ను సర్దుబాటు చేయటం కోసం.. మిగిలినదేశాల మీద ఆధారపడతారు. దీంతో.. అక్కడ డిమాండ్ పెరిగి.. అందుకు తగ్గ లభ్యత ఉండదు కాబట్టి.. అక్కడా ధరలు పెరిగే వీలుంది. అదే సమయంలో పాడైన డ్యామ్ ను బాగుచేసి.. మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే.. ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంచనా వేయలేకపోతున్నారు. రెండు దేశాల యుద్ధం ప్రపంచ దేశాలకు మరో కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టిందని చెప్పక తప్పదు.