Begin typing your search above and press return to search.

బొత్స ఇలాకాలో మ‌రో వివాదం

By:  Tupaki Desk   |   15 Aug 2022 11:30 PM GMT
బొత్స ఇలాకాలో మ‌రో వివాదం
X
పీఆర్సీ వివాదాలు ముగియ‌లేదు. డీఏ చెల్లింపుల‌పై వివాదాలు ఆగ‌లేదు. వీటితో పాటు నాడు నేడు బ‌డులు కొన్నే అన్నీ ఇంకా ఆ స్థాయిలో తీర్చిదిద్దుకోలేదు. ఇవే కాదు ఇంకా కొన్ని స‌మ‌స్య‌లు విలీనాగ్ర‌హాలు, విభ‌జ‌న స‌మ‌స్య‌లు వెన్నాడుతున్న విద్యాశాఖ ఉద్యోగుల‌కు ముఖ్యంగా పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు మ‌రో క‌ష్టం వ‌చ్చి ప‌డింది.

మంత్రి బొత్స సత్య‌నారాయణ సార‌థ్యం వ‌హిస్తున్న విద్యాశాఖ‌లో మ‌రో మార్పున‌కు శ్రీ‌కారం దిద్ద‌నున్నారు. ఉపాధ్యాయుల హాజ‌రు శాతం న‌మోదుపై కొత్త ప్ర‌యోగ విధానం ఒక‌టి అమ‌ల్లోకి తేనున్నారు. దీని ప్ర‌కారం ఉపాధ్యాయుల హాజరు శాతం ఎంత‌న్న‌ది ఓ యాప్ ద్వారా (ప్ర‌త్యేకంగా రూపుదిద్దుకున్న యాప్ ద్వారా) నిర్ణ‌యించాల‌ని భావిస్తూ ఉన్నారు.

ఇప్ప‌టికే విద్యార్థుల హాజ‌రు శాతం, వారి మార్కుల వివ‌రాలు, అదేవిధంగా మ‌రికొన్ని వివ‌రాలు వేర్వేరు యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తూ వ‌స్తున్న ఉపాధ్యాయుడికి తాజాగా మ‌రో కొత్త భారం నెత్తిన ప‌డ‌నుంది. సిగ్న‌ల్స్ లేని ఊళ్ల‌లో త‌మ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఓ వైపు వీరంతా వాదిస్తుంటే, యాప్ చెప్పిన ప్రకార‌మే తాము న‌డుచుకుంటామ‌ని, హాజ‌రుశాతం నిర్ణ‌యించేందుకు అదేవిధంగా వారి స‌మ‌య పాల‌న‌పై నిబ‌ద్ధ‌త పెంచేందుకు ఈ విధంగా యాప్ ద్వారా హాజ‌రుశాతాన్ని గ‌ణిస్తున్నామ‌ని విద్యాశాఖ చెబుతోంది. కానీ వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకునేలా లేవు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యా విధానంలో రోజుకొక వివాదం చోటు చేసుకుంటుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ విలీన వివాదాలు, పాఠ‌శాలల ఆగ్ర‌హాలు వెల్లువెత్తిన వైనాలు చూశాం. కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా ఉపాధ్యాయుల హాజరు శాతం న‌మోదు చేసేందుకు ఏపీ స‌ర్కారు కొత్త‌గా ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ అనే యాప్ ను తీసుకువ‌స్తున్న‌ది. దీని ప్ర‌కారం ఉపాధ్యాయులు త‌మ ఫేస్ ను ఇందులో రిక‌గ్నిష‌న్ చేయించుకోవాలి. యాప్ ను మొబైల్ లోకి డౌన్లోడ్ చేసుకున్నాకే ఇది సాధ్యం అని తెలుస్తోంది. దీనిపై ప‌లు ఉపాధ్యాయ సంఘాలు మండిప‌డుతున్నాయి. సెల్ ఫోన్ సిగ్న‌ల్స్ అన్న‌వి లేని చోటు అప్పుడు తామేం చేయాల‌ని ఉపాధ్యాయులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌పై సెల‌వులు కూడా ఇందులోనే న‌మోదు చేసుకోవాల‌ని సంబంధిత ఉన్న‌తాధికారులు చెబుతున్న మాట.


ఇప్ప‌టికే చాలా చోట్ల సెల్ఫోన్ సిగ్న‌ల్స్ లేక చాలా వ‌ర‌కూ చాలా డేటాను అప్ లోడ్ చేయ‌లేక‌పోతున్నామ‌ని, పాఠాలు బోధన చేయ‌డం క‌న్నా డేటా ఎంట్రీ పనుల‌కే త‌మ‌ను ఎక్కువ‌గా వినియోగించుకుంటున్నార‌న్న ఆరోపణ‌లూ ఉపాధ్యాయుల నుంచి ఉన్నాయి. ఇప్పుడు తాజా యాప్ తో త‌మ‌కు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని, హాజ‌రు శాతం త‌గ్గితే కొన్ని సార్లు న‌మోదుకాక‌పోతే అలాంట‌ప్పుడు త‌మ ప‌రిస్థితి ఏం కావాల‌ని, వేత‌నాల్లో కోత విధించి పంపుతారా అని ప్ర‌శ్నిస్తున్నారు. గతంలో కూడా ఇత‌ర ప్ర‌భుత్వశాఖ‌ల్లో ప‌నిచేసే వారు త‌ప్ప‌నిస‌రిగా థంబ్ వేయాల‌ని, ఆన్లైన్ లో థంబ్ రీడింగ్ అయ్యాక ఆఫీసుకు హాజ‌రు అయి ఉన్నార‌ని ప్ర‌భుత్వం అప్ప‌ట్లో గుర్తించేది. దీనిపై కూడా చాలా ఆందోళ‌నలే రేగాయి. దీంతో అప్ప‌టి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం నుంచి వెన‌క్కు త‌గ్గింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇలాంటి త‌ల‌నొప్పులే త‌మ‌కు అంట‌గ‌డుతున్నార‌ని ఉపాధ్యాయులు చెబుతున్నారు.