Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో మరో అసమ్మతి.. అసెంబ్లీ ఎన్నికల నాటికి రచ్చరచ్చే

By:  Tupaki Desk   |   29 Jan 2023 7:00 PM GMT
బీఆర్ఎస్ లో మరో అసమ్మతి.. అసెంబ్లీ ఎన్నికల నాటికి రచ్చరచ్చే
X
జాతీయ రాజకీయాలు జోరుగా సాగిస్తున్న బీఆర్ఎస్ కు తెలంగాణలో మాత్రం అసమ్మతి రాగాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో ఎంతోకాలం నుంచి వెయిట్ చేస్తున్న వారు  పదవులు దక్కించుకోవడానికి  ఇదే సమయమని రచ్చకెక్కుతున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లో మొన్నటి వరకు ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయిలోనే అసంతృప్తి ఉండేది. కానీ  ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్లలో ఎక్కువయ్యాయి. మున్సిపల్, కార్పొరేషన్లు ఎన్నికై మూడేళ్లు పూర్తి చేసుకున్నందున కొందరు గులాబీ నేతలే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బుజ్జగించినా వినకుండా ఇతర పార్టీల నాయకులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ అసమ్మతిని ఇక్కడితో తుంచేస్తేనే బాగుంటుందని, లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి మరీ ఎక్కువైతే రచ్చ రచ్చే అవుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నవంబర్లో జగిత్యాలలో పర్యటించారు. దీంతో ఆ జిల్లాల్లోని కేడర్ మరింత బలపడినట్లయింది. కానీ ఇటీవల జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణిపై అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యారు. ఆ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ వరకు చేరింది. కానీ అంతలోనే తనను వేధిస్తున్నారంటూ చైర్ పర్సన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమెను బుజ్జగించేందుకు ఆ జిల్లా నాయకులు సమాయత్తమవుతున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి సెగ్మెంట్ లోని జవహర్ నగర్ మేయర్ కావ్యపై 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఒకవేళ టీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటేస్తే ఆమె పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది.

అయితే సొంత పార్టీ నేతలు అవిశ్వాన తీర్మానం పెట్టడంపై బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. కొందరు ఎంతో కాలం నుంచి పదవుల కోసం చూస్తున్న వారు ఓ వర్గాన్ని తయారు చేసి అవిశ్వాస తీర్మానాలు పెట్టిస్తున్నారు. మరి కొందరు తమకు కాంట్రాక్టులు దక్కకుండా చేస్తున్నారని తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినా వినడం లేదు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ద్వారా కేసీఆర్ స్థాయి వరకు వెళ్లే అవకావం ఉంటుంది. దీంతో తమపై బాస్ దృష్టి పడుతుందని అనుకుంటున్నారు. అలాగైనా తమకు పదవులు దక్కుతాయని భావిస్తున్నారు.

ఈ అసమ్మతిని అక్కడితోనే తుంచాలని కొందరు పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. లేకుంటే ఎన్నికల నాటికి రచ్చ రచ్చే అవుతుందని అంటున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఓ వైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్ బలపడేందుకు యత్నిస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ కే కేడర్ ఫుల్ గా ఉండడంతో  బీఆర్ఎస్ అసమ్మతి నేతలు వారి మద్దతుతో గెలుస్తామని భావిస్తున్నారు. తమకు సరైన న్యాయం దక్కకపోతే అవసరమైతే పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు.  ఈ నేపథ్యంలో మంత్రలు, ఎమ్మెల్యేలు కలగజేసుకోవాలని కోరుతున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు ఎంత బుజ్జగించిన వినకపోవడంతో పాటు ఏకంగా అధిష్టానాన్ని కలిసేందుకు యత్నిస్తున్నారు.