Begin typing your search above and press return to search.

విషాదం: దిగ్గజ క్రికెటర్ ప్రాణాలు తీసిన రోడ్డు యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   15 May 2022 2:29 AM GMT
విషాదం: దిగ్గజ క్రికెటర్ ప్రాణాలు తీసిన రోడ్డు యాక్సిడెంట్
X
క్రికెట్ అభిమానులకు ఇదో బ్యాడ్ సండే. ఇక.. ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ కు అయితే.. ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న దెబ్బలుగా చెప్పాలి. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం ఆస్ట్రేలియా ప్రజల్ని ఎంతటి విషాదానికి గురి చేసిందో తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ క్రికెటర్ కమ్ ఆల్ రౌండర్ 46 ఏళ్ల ఆండ్రూ సైమన్స్ తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఒక రోడ్డు ప్రమాదంలో అతగాడు ప్రాణాలు వదిలారు. సైమండ్స్ ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిదిగా మారింది.

జడలు వేసినట్లు ఉండే జులపాల జుట్టు.. తెల్లటి పెదాలు.. భారీ దేహంతో ఉండే సైమండ్స్ మైదానంలోకి దిగాడంటే అతగాడి మార్కు చూపిస్తుంటాడు. అది బాల్ తో అయినా.. బ్యాట్ తో అయినా ప్రత్యర్థికి చుక్కలు చూపించే టాలెంట్ అతగాడి సొంతం. దాదాపు పదేళ్ల క్రితం (2012) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇతగాడు 198 వన్డేల్లో 5088 పరుగులు చేశారు. అందులో ఆరు సెంచరీలు..30 హాఫ్ సెంచరీలు చేశారు. బౌలింగ్ విషయానికి వస్తే 133 వికెట్లు తీసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గా కేవలం పద్దెనిమిది పరుగులు ఇచ్చిన ఐదు వికెట్లు తీసిన మొనగాడిగా అతనికి పేరుంది.

మూడు ప్రపంచ కప్ లను గెలుచుకున్న ఆసీస్ జట్టులో సభ్యుడిగా సైమండ్స్ సుపరిచితుడు. శ్రీలంక తో ఆడిన సీరిస్ తో అంతర్జాతీయ క్రికెట్ కి ఎంట్రీ ఇచ్చిన అతను.. అతి తక్కువ కాలంలో తన ఆటతో అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. క్వీన్స్ లండ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టౌన్స్ విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో క్వీన్స్ లాండ్ నగరానికి పశ్చిమాన 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్ లో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా వెళుతున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆండ్రూ సైమండ్స్ మాత్రమే ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన సైమండ్స్ ను ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను రక్షించేందుకు వైద్యలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ప్రమాదంలో సైమండ్స్ తీవ్ర గాయాల బారిన పడినట్లుగా చెబుతున్నారు.

అతడి మరణంతో క్రీడా లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరో దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మరణం తెచ్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వేళ.. ఆసీస్ క్రికెట్ క్రీడాభిమానులకు ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఆయన మరణ వార్త విన్నంతనే పలువురు ప్రముఖులు.. మాజీ ఆటగాళ్లు.. క్రీడాభిమానులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.

ఐపీఎల్ లో దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్.. ముంబయి ఇండియన్స జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో దక్కన్ ఛార్జర్స్ అతడ్ని రూ.5.4 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అతడ్ని వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో రెండు జట్ల తరఫున ఆడిన సైమండ్స్ మొత్తం 974 పరుగులు చేయగా.. అందులో ఒక సెంచరీ, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో తనకు భారీ ధర పలకటంతోనే తనకు.. క్లార్క్ తో ఫ్రెండ్ షిప్ చెడినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమైనా.. రోడ్డు ప్రమాదం విలువైన ఒక దిగ్గజ క్రికెటర్ ప్రాణాల్ని తీసిందని చెప్పక తప్పదు.