Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో ఆంధ్రా పేరు .. రంగంలోకి దిగిన ఈడీ

By:  Tupaki Desk   |   24 Sep 2021 2:30 AM GMT
అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో ఆంధ్రా పేరు ..  రంగంలోకి దిగిన ఈడీ
X
గుజరాత్‌ లోని పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్‌ దందా వెనుక ఎవరున్నారు, ఈ సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అనేది తేల్చే పనిలో పడింది. ఈనెల 13న గుజరాత్‌ ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో డ్రగ్స్‌ ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ ఐ అధికారులు. 2,988 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అఫ్గనిస్తాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా భారత్‌ కు డ్రగ్స్ తరలించినట్టు అధికారులు గుర్తించారు. టాల్క్‌ స్టోన్స్‌, టాల్కం పౌడర్‌గా పేర్కొంటూ డ్రగ్స్‌ని భారత్‌కు రవాణా చేశారు. అయితే డీఆర్‌ ఐ విచారణలో నార్కోటిక్‌ డ్రగ్‌ హెరాయిన్‌ గా నిర్థారించారు.

భారీ ఎత్తన డ్రగ్స్‌ పట్టుబడటంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ చేపట్టింది డీఆర్‌ ఐ. న్యూఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, మాండ్వి, గాంధీధామ్‌, విజయవాడ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీలో 16.1 కేజీల హెరాయిన్‌, నోయిడాలోని నివాస ప్రాంతాల్లో 10.2 కేజీల కొకైన్‌, 11 కేజీల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అఫ్గనిస్తాన్‌ దేశస్తులు, ఒక ఉబ్జెకిస్థాన్ దేశస్తుడితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేశారు డీఆర్‌ ఐ అధికారులు. అరెస్టయిన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

ఆషి ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం డీఆర్‌ ఐ కస్టడీలో ఉన్నారు. చెన్నైలో ఎం సుధాకర్‌, జి దుర్గాపూర్ణ, వైశాలిని అరెస్ట్‌ చేశారు. వీరిని గుజరాత్‌ లోని భుజ్‌ కోర్టులో హాజరు పరిచారు. వీరిని 10 రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అంగీకరించింది న్యాయస్థానం. తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే మొత్తం విలువ రూ. 21,000 కోట్లకు పైగానే ఉంటుందని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తేల్చారు.

ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా ఆంధ్రాలో తేలగా, ఆ కంపెనీ యాజమాన్య ఎం. సుధాకర్, జి. దుర్గా పూర్ణ వైశాలిని చెన్నైలో డీఆర్ ఐ , అధికారులు అరెస్టు చేశారు. వారిని గుజరాత్‌ లోని కచ్ ప్రాంతానికి తరలించి భుజ్ పట్టణంలోని న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితులను తమకు 10 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం కస్టడీలో నిందితుల్ని డీఆర్ ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ దందాలో భాగస్వాములైన మిగతావారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ దందాలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరక్టరేట్ ప్రారంభించింది.

మాదకద్రవ్యాల ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బుతో అక్కడి తాలిబన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు మారణాయుధాలు కొనుగోలు చేస్తుంటాయి. ఇదంతా టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్‌లో భాగం. ఇప్పుడు తాజాగా బయటపడ్డ డ్రగ్స్ వెనకాల ఉన్న ఉగ్రవాద సంస్థతో పాటు వారికి నిధులు అందజేసి మాదకద్రవ్యాలను భారత్‌కు తెప్పిస్తున్న బడాబాబుల గురించి ఈడీ ఆరా తీస్తోంది. నగదు లావాదేవీలు ఏరూపంలో జరిగాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.