బ్రేకింగ్... సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

Wed Jan 22 2020 22:26:53 GMT+0530 (IST)

Andhra Pradesh legislative council sends Decentralisation Bill

ఏపీలో గడచిన నెల రోజులుగా ఆసక్తి రేకెత్తిస్తున్న రాజధాని వ్యవహారం బుధవారం రాత్రి కీలక మలుపు తిరిగింది. అధికార పార్టీ వైసీపీకి ఝలక్ ఇస్తూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దుకు ప్రతిపాదించిన బిల్లును కూడా సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ చర్య నిజంగానే వైసీపీకి మింగుడుపడనిదేనని చెప్పక తప్పదు. ఎలాగైనా ఈ సమావేశాల్లోనే ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసేలా రంగం సిద్ధం చేసేయాలని దూకుడుగా వ్యవహరించిన జగన్ సర్కారుకు... అసెంబ్లీలో ఎదురే లేకపోగా... టీడీపీకి బలమున్న శాసనమండలిలో మాత్రం అడ్డు తగిలింది.అసలు ఈ రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టకుండా తనదైన శైలి వ్యూహాన్ని అమలుపరచిన టీడీపీ... బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడంతో పాటుగా ఏకంగా ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేసింది. ఈ చర్యతో జగన్ సర్కారుకు నిజంగానే షాక్ తగిలిందని చెప్పక తప్పదు. మంత్రులంతా శాసనమండలిలో తిష్ట వేసినా కూడా వైసీపీ సర్కారు... టీడీపీ వ్యూహాన్ని అడ్డుకోలేకోయింది. మొత్తంగా మంగళవారం బిల్లును సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోగలిగిన టీడీపీ సభ్యులు.. బుధవారం ఏకంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా రచించుకున్న వ్యూహాన్ని విజయవంతగా ముగించారని చెప్పాలి.

ఈ బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో మూడు రాజధానుల దిశగా సాగుతున్నజగన్ కొంత కాలం పాటు వేచి చూడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులు తిరిగి సభకు రావాలంటే హీనపక్షం 3 నెలల సమయం పడుతుందని అప్పటిదాకా మూడు రాజధానులపై జగన్ సర్కారు వేచి చూడక తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్న తరుణంలో మండలిలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఛైర్మన్ పోడియాన్ని ఇరుపక్షాల సభ్యులు చుట్టుముట్టారు.