తొందర కూడదు : ముందుకు వెనక్కూ వైసీపీ...?

Sun May 29 2022 08:00:01 GMT+0530 (IST)

Andhra Pradesh YSRCP Government

సాధారణంగా ఎన్నికలను విపక్షాలు కోరుకుంటాయి. ఎందుచేతనంటే ఎపుడు ఎన్నికలు జరిగితే అపుడు అవి అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అవకాశం వారికి వస్తుంది. అలా ఎన్నికలు రేపే రావాలి అంటూ రాగాలాపన చేయడం ప్రతిపక్షాల వంతు. ఆ తంతు ఏపీలో మూడేళ్ళుగా అలా జరుగుతూనే ఉంది. కానీ అధికార పక్షం దూకుడు పెంచితే ఎలా ఉంటుంది.అందరికీ డౌట్లు పెరిగిపోవా. జగన్ జిల్లా సభలకు అటెండ్ అవుతున్నారు. అక్కడ పంచ్ డైలాగులతో విపక్షంతో చెడుగుడు ఆడుతున్నారు. ఇంకో వైపు గడప గడపకూ వైసీపీ అంటూ మరో ప్రోగ్రాం ని స్టార్ట్ చేశారు. ఇది చాలదన్నట్లుగా సామాజిక న్యాయ భేరీ పేరిట బస్సు యాత్రను మంత్రులతో ఏపీలో తిప్పుతున్నారు.

దీన్ని చూసిన వారికి ఏమి అనిపిస్తుంది. అధికార పార్టీ ముందస్తు ముస్తాబుకే ఇదంతా అనుకుంటే తప్పు ఉంటుందా. అయితే దీనికి తగినట్లుగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఎన్నికలు 2023లోనో లేక 2024లోనో ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. దాంతో ఇంకా సందేహాలు పెరిగిపోయాయి.

ఈ క్రమంలో ఇపుడు మాజీ మంత్రి  పేర్ని నాని  తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024లోనే జరుగుతాయని అంటున్నారు. నిజానికి అయిదేళ్ళ పాటు ప్రజలు అధికారం ఇచ్చిన తరువాత ఏ ప్రభుత్వం అయినా ముందస్తునకు వెళ్తోంది అంటే అది ఎంత వ్యూహం అనుకున్నా తమకు ప్రజలు ఇచ్చిన చాన్స్ ని తగ్గించుకుని తాము నిస్సహాయులమని చెప్పుకోవడమే. మరి అందుకే ఎక్కడో ఒకచోట తప్ప చాలా వరకూ ముందస్తుకు వెళ్ళిన వారంతా చేదు ఫలితాలను మూటకట్టుకున్నారు.

ఇక ఏపీలో చూస్తే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రాజకీయ కారణాలే కాదు ఆర్ధిక కారణాలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. మరో రెండేళ్ళ పాటు అప్పులతో ప్రభుత్వాన్ని నడపడం కష్టమని భావించే ఎంత వీలైతే అంత ముందుగా ఎన్నికలకు వెళ్ళి బరువు దించుకోవాలని చూస్తున్నారు అని కూడా అంటున్నారు.

దాంతోనే ముందస్తు మాట వినిపిస్తోంది. మరి పేర్ని నాని లాంటి వారు 2024లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పడం అంటే వైసీపీలో కూడా ఎటూ తేల్చుకోలేని సీన్ ఉందని అంటున్నారు. ఒక వేళ ఇపుడు గెలుస్తామని అనుకుంటే ఎన్నికలు ముందుకు తెస్తారు. అలాంటిది లేదు వ్యతిరేకత పెరుగుతోంది అనుకుంటే మిగిలిన కాలం కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ అపుడు ఏం జరిగితే జరగనీయ్ అన్నట్లుగా ఎన్నికలకు వెళ్తారు.

మరి వైసీపీకి గడప గడపకూ ప్రభుత్వం ప్రోగ్రామ్  తో పాటు మంత్రుల బస్సు యాత్ర ద్వారా ఏమైనా కొత్త సంగతులు తెలిశాయా. అందుకేనే తొందర కూడదు అని అనుకుంటున్నారా. ఏమో రాజకీయాల్లో చాలా ఉంటాయి కదా ఆలోచించాల్సిందే.