బడ్జెట్ సమావేశాల్లోనే రాజ్యసభ ఎన్నికలు: 16 నుంచి సభాసమరం

Sun Jun 07 2020 12:00:01 GMT+0530 (IST)

Andhra Pradesh Budget Assembly Sessions

తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. గత మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురానుంది. ఈక్రమంలో రాష్ట్ర శాసనసభ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని సమాచారం.ఈ సమావేశాల నిర్వహణపై ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలపైనే ఈ సమావేశం ఉండనుందని సమాచారం. దీంతోపాటు రాజ్యసభ ఎన్నికలు కూడా ఉండడంతో అన్నీ కలిపి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా 16వ తేదీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో మొదలుపెట్టి మరుసటి బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఈ విధంగా ఆలోచిస్తోంది.

16వ తేదీన గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై.. సమావేశాల నిర్వహణపై చర్చించనుంది. ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? దీంతోపాటు వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలు ఐదు రోజుల్లోపే ముగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

వాస్తవంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే శాసనసభ్యులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ విధంగా అన్ని కలిసొచ్చేలా బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం యోచిస్తోంది. అధికారిక సమాచారం మేరకు ఈనెల 18వ తేదీన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారని అంచనా. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు తీసుకువచ్చేందుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఏది ఏమున్నా ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం వెలువడనుంది. అప్పుడు సమావేశాల నిర్వహణపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.