Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌కీయం... కేరాఫ్ క‌న్ఫ్యూజ‌న్‌!

By:  Tupaki Desk   |   28 July 2018 1:30 AM GMT
ఏపీ రాజ‌కీయం... కేరాఫ్ క‌న్ఫ్యూజ‌న్‌!
X
సరిగ్గా పదిహేనేళ్ల కిందట వచ్చిన ‘పెళ్లాం ఊరెళ్తే’ సినిమా గుర్తుందా..? ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఇప్పుడా సినిమాలోని ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆ సినిమాలో హీరోలు శ్రీకాంత్ - వేణు - కమెడియన్ సునీల్... నటి జ్యోతి - మరో కమెడియన్ గుండు హనుమంతరావు మధ్య ఒక హోటల్ వద్ద ఒక సీన్ ఉంటుంది. శ్రీకాంత్ భార్య ఊరెళ్లినప్పుడు సునీల్ ప్రోద్బలంతో ఒక వేశ్యను రప్పించుకుని హోటల్‌లో మకాం వేస్తాడు శ్రీకాంత్. కానీ, అక్కడ వేరే కార్యక్రమం కోసం శ్రీకాంత్ భార్య వస్తుంది. అలాగే వేణు తన ప్రియురాలితో వస్తాడు. భార్య అక్కడికి రావడంతో కంగారు పడిన శ్రీకాంత్ ఆ వేశ్యను వేణు భార్యగా చెబుతాడు. ఇదంతా చూస్తున్న రూంబాయ్ గుండు హనుమంతరావు... వేశ్య పాత్రలో నటించిన జ్యోతిని ఆమెకు ఎవరు ఏమవుతారో అడుగుతుంటాడు.. ఆమె చెప్పిన సమాధానాలు విని ఎవరు ఎవరికి భర్తో.. ఎవరికి అన్నయ్యో అర్థం కావడం లేదంటూ జత్తు పీక్కుంటాడు.

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నాయి. ప్రజలు కూడా అంతే గందరగోళానికి గురవుతున్నారు. కొద్దినెలల కిందట వరకు ప్రధానంగా టీడీపీ - వైసీపీ మధ్యే మాటల యుద్ధం నడిచేది. కానీ... టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం.. అలాగే జనసేన టీడీపీకి దూరమవడం జరిగాక రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చినా బీజేపీతో రహస్య బంధం సాగిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో వైసీపీ - బీజేపీలు కలిసి తమపై కుట్ర చేస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు మొదటి నుంచి తనకు ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీ... తన నుంచి వేరుపడిన జనసేన రెండిటినీ లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఆరోపణ‌లు చేస్తోంది. ఆ రెండు పార్టీలూ కలిసి పనిచేస్తున్నాయని.. ఇంకా చెప్పాలంటే బీజేపీ కూడా ఆ ముఠాలో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే మొన్నటివరకు వైసీపీ - జనసేనలు పరస్పరం విమర్శించుకోలేదు. దీంతో టీడీపీ ఆరోపణలు నిజమని చాలామంది నమ్మారు. కానీ.. మొన్న జగన్ పవన్ పై ఆరోపణలు చేశాక పరిస్థితి మారిపోయింది. పవన్ ప్రతి ఆరోపణలు చేయడం.. అవన్నీ కలిసి వ్యక్తిగత ఆరోపణలుగా మారడంతో పరిస్థితి ముదిరిపోయింది.

నేతలు ఇలా ఎవరు ఎవరిని తిడుతున్నారో... ఎవరితో కలుస్తున్నారో అర్థంకాక జనం జుత్తు పీక్కుంటున్నారు. టీడీపీ - బీజేపీల మధ్య బంధం పరిస్థితేంటి...? వైసీపీ - బీజేపీల మధ్య అవగాహన ఉందా? వైసీపీ - జనసేనలు మిత్రులా... అలా అయితే ఇద్దరు నేతలూ ఎందుకు అంత దారుణంగా దూషించుకుంటున్నారు? టీడీపీ - వైసీపీ - బీజేపీ - జనసేనలు వచ్చే ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తాయా... లేదంటే ఏఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి.. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు వంటివి అర్థం చేసుకోలేకపోతున్నారు. పార్టీ నేతల తీరే అందుకు కారణమవుతోంది. ఎన్నికలొస్తే కానీ ఈ కన్ఫ్యూజన్‌ కు ముగింపు పడదంటున్నారు.