అందరికి రెండోస్సారి.. బాబుకు మాత్రం ఒక్కసారే!

Mon May 20 2019 23:00:01 GMT+0530 (IST)

Andhra People on Chandrababu naidu

ఇటీవల జరుగుతున్న ఎన్నికల్ని జాగ్రత్తగా గమనించండి. గడిచిన రెండు.. మూడేళ్లలో జరిగిన ఎన్నికల్ని చూస్తే.. ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రం ఏదైనా.. పవర్లో ఉన్న ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వటం కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే.. కేంద్రంలోనూ అదే పరిస్థితి. 2004లో యూపీఏ సర్కారుకు అధికారం ఇచ్చిన ప్రజలు.. 2009లోనూ మరోసారి అవకాశాన్ని ఇవ్వటాన్ని మర్చిపోకూడదు.కేరళ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలు మినహాయిస్తే..  ఏ రాష్ట్రంలో చూసినా.. అధికారపక్షానికి రెండో అవకాశాన్ని ఇవ్వటం.. మూడోసారి మాత్రం ప్రభుత్వానికి హ్యాండ్ ఇవ్వటం కనిపిస్తుంది. ప్రతిసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే తమిళనాడులోనూ అన్నాడీఎంకే రెండోసారి అధికారాన్ని చేపట్టటం కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో జయలలిత మరణించటం వేరే సంగతి.

తెలంగాణలో ఈ మధ్యన ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ కు రెండోసారి పట్టం కట్టటం చూశాం. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారుకు మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయటం తెలిసిందే. ఇలా చూసినప్పుడు.. దేశం మొత్తమ్మీదా చంద్రబాబుకు మాత్రం రెండోసారి అవకాశం ఇచ్చేందుకు మాత్రం ఏపీ ప్రజలు సిద్ధంగా లేని వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు. కేంద్రం.. రాష్ట్రం అన్న తేడా లేకుండా అంతా రెండోస్సారి అవకాశం ఇస్తే.. బాబుకు మాత్రం ఒక్కసారికే బై..బై బాబు అని చెప్పేయటం గమనార్హం.