Begin typing your search above and press return to search.

అప్పుడెప్పుడో అడ‌గాల్సింది ఇప్పుడా అడిగేది?

By:  Tupaki Desk   |   28 July 2018 7:25 AM GMT
అప్పుడెప్పుడో అడ‌గాల్సింది ఇప్పుడా అడిగేది?
X
ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్న‌ట్లుగా మారింది ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబు తీరు. హ‌డావుడితో.. ఆఘ‌మేఘాల మీద త‌యారు చేసి.. అధికార బ‌లంతో ఆమోద ముద్ర ప‌డేలా చేసిన విభ‌జ‌న బిల్లులో ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా చాలానే అంశాలు ఉన్నాయి.

అంతేకాదు.. విభ‌జ‌న సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఇచ్చిన హామీల్ని అప్పుడున్న ప‌రిస్థితుల్లో బిల్లులో చేర్చ‌లేదు. దీంతో.. ప్ర‌ధాని హామీలునోటి మాట‌గా ఉన్నాయే త‌ప్పించి.. చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేకుండా పోయింది. నైతిక‌త మీద‌నే హామీల అమ‌లు ఉంటుందే త‌ప్పించి.. మాకు రావాల్సిన‌వి మాకు రావాల్సిందేనంటూ గ‌ట్టిగా నిలదీసే అవ‌కాశం ఉండ‌దు.

ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వెంట‌నే గుర్తించాల్సిన చంద్ర‌బాబు స‌ర్కారు.. నాలుగున్న‌రేళ్ల ఆల‌స్యంగా గుర్తించింది. ప్ర‌త్యేక హోదా మీద దృష్టి పెట్టి.. ఇప్పుడు దాంతో రాజ‌కీయ ల‌బ్ధిని పొందాల‌నుకుంటున్న నేప‌థ్యంలో.. హోదా అమ‌లు ఎలా అన్న అంశంపై ఇప్పుడు బాబు స‌ర్కారు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విభ‌జ‌న చ‌ట్టంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించింది.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్న పార్ల‌మెంట‌రీ హోంశాఖ స్థాయి సంఘం చిదంబ‌రం అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు త‌న వాద‌న‌ను వినిపించింది. విభ‌జ‌న బిల్లులో మార్పులు చేయాల‌ని సూచించింది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇలాంటివి సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ముందుచూపు లేక‌పోవ‌టం.. హోదా సాధ‌న ఎలా అన్న అంశంపై మొద‌ట్నించి దృష్టి సారించ‌ని బాబు స‌ర్కారు వైఫ‌ల్యంతో ఇప్పుడున్న ప‌రిస్థితి ఎదురైంద‌ని చెప్పాలి.

ఏపీ స‌ర్కార్ సూచించిన మార్పులు చూస్తే..

1. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చిన ప్రత్యేకహోదా సహా ఇతర హామీలన్నింటినీ విభజన చట్టంలో చేరుస్తూ సవరణ చేయాలి.

2. విభజన చట్టంలోని సెక్షన్‌ 50 - 51 - 56 ప్రకారం పన్ను బకాయిలు - రీఫండ్‌ ను జనాభా ప్రాతిపదికన విభజించేలా ఈ సెక్షన్లను సవరించాలి.

3. సింగరేణి కాలరీస్‌ ఆస్తులు - అప్పులను జనాభా ప్రాతిపదికనపంచేలా షెడ్యూల్‌-12లో సవరణలు చేయాలి.

4. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కల్పించిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఏపీకీ వర్తింపజేస్తూ సెక్షన్‌ 94(1) - (2)ను సవరించాలి.

5. రాజధానిలో అసెంబ్లీ - రాజ్‌ భవన్‌ - ముఖ్యమంత్రి బంగ్లా - మంత్రుల క్వార్టర్లు - సచివాలయం - ఉద్యోగుల గృహవసతి - ఇతర మౌలికవసతుల నిర్మాణానికి రూ.39,937 కోట్లు అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరించేలా సెక్షన్‌ 94(3)ను సవరించాలి.