వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో జీవించాల్సిందే: జగన్

Thu Jul 16 2020 15:40:03 GMT+0530 (IST)

Andhra CM Jagan On About New Dangerous Disease Spreads in Andhra

ఏపీలో శరవేగంగా ప్రబలుతున్న కరోనా వైరస్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి మన సమాజంలో ఉండకపోచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని.. కలెక్టర్లు మరింతగా దృష్టిపెట్టి ప్రజల్లో చైతన్యం నింపాలని ఏపీ సీఎం కుండబద్దలు కొట్టారు.85శాతం మంది ఇంట్లోనే ఉండి కరోనా మందులను తీసుకుంటే తగ్గిపోతుందని.. ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చని సీఎం జగన్ సూచించారు. ప్రతీరాష్ట్రం సరిహద్దులను తెరిచిందని.. కాబట్టి రాకపోకలు పెరిగి అంతర్జాతీయ విమానాలు కూడా తిరుగుతుండడంతో కేసులు పెరుగుతాయని జగన్ ప్రజలను హెచ్చరించారు.

కరోనా వైరస్ పై సమీక్షించిన సీఎం జగన్.. ఏపీలోని మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక రాష్ట్రం ఏపీనని.. ప్రస్తుతం విశాఖ - పశ్చిమగోదావరి - విజయనగరం. గుంటూరు - ప్రకాశం - కడప - కర్నూలు జిల్లాలకు ఆరోగ్య శ్రీ సేవలు విస్తరిస్తున్నట్టు వివరించారు. ఏపీలో వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలు కావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

ఏపీలో 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయని.. వాటిని అన్ని జిల్లాల్లో వర్తింపచేస్తామని ప్రజలకు భరోసానిచ్చారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో డబ్ల్యూ.హెచ్.వో మందులను ఇస్తున్నామని సీఎం తెలిపారు.