Begin typing your search above and press return to search.

రీల్ కు మించిన రియల్ లవ్ స్టోరీ.. ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి

By:  Tupaki Desk   |   29 Jan 2023 3:00 PM GMT
రీల్ కు మించిన రియల్ లవ్ స్టోరీ.. ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి
X
రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రియల్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. ట్విస్టులే.. ట్విస్టులు అన్నట్లుగా సాగే ఈ రియల్ ప్రేమ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి మధ్య పన్నేండేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన లవ్ స్టోరీకి.. తాజాగా విశాఖలోని రుషికొండలో జరిగిన పెళ్లితో ప్రేమకథ కంచికి వెళ్లి..దాంపత్య జీవితమనే కొత్త కథ షురూ అయ్యింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.
.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు దగ్గర్లోని భవానీ ప్రసాద్ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం సొంతూరు నుంచి విశాఖకు వచ్చి స్థిరపడ్డారు. పైచదువుల కోసం పదమూడేళ్ల క్రితం భవానీ ప్రసాద్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ మలేషియాకు చెందిన ఐక్ వే అనే అమ్మాయితో పరిచయమైంది. వారి పరిచయం కాస్తా కొద్ది కాలానికే ప్రేమగా మారింది. దీంతో.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

వారు పెళ్లి చేసుకోవాలంటే సరిపోతుందా? ఇరు కుటుంబాల వారు ఓకే చెప్పాలిగా? చాలా ప్రేమకథల్లో మాదిరే వీరి లవ్ స్టోరీలో తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. పెళ్లి చేసుకోవటానికి అంగీకరించమంటే అంగీకరించమని తేల్చేశారు. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా తాను పెళ్లి చేసుకోనని.. అదే సమయంలో వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోనని తేల్చేసింది ఐక్ వే. హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని భవానీ ప్రసాద్.. తన మాటే అదేనని తేల్చేశాడు. దీంతో వీరి లవ్ స్టోరీకి కామా పెట్టేసి.. స్నేహితులుగా మాత్రం కొనసాగుదామని నిర్ణయించారు.

ఉన్నత చదువులు పూర్తి అయ్యాక ఇద్దరు జాబ్ లు చేశారు. కొద్ది కాలానికి భవానీ ప్రసాద్ తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. సొంతంగా వ్యాపారాన్ని షురూ చేశారు. ఈ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవటానికి ఐక్ వే ఆయన దగ్గర జాబ్ చేస్తున్నారు. చూస్తుండగానే కాలం వేగంగా పరుగులు తీసి.. 12 ఏళ్లకు దాటిపోయింది. వీరి వయసు 40 ప్లస్ లోకి వచ్చేశారు. తమ ప్రేమకు నో చెప్పిన తల్లిదండ్రులకు తగ్గట్లే.. వారు తీసుకొచ్చే సంబంధాల విషయంలో వీరిద్దరూ నో చెప్పేయటంతో చివరకు ఇరు కుటుంబాల వారు దిగి వచ్చారు. పెళ్లి చేసుకోవటానికి ఇరు కుటుంబాల వారు ఓకే చెప్పటంతో.. తాజాగా అందరి సమక్షంలో విశాఖలోని రుషికొండలో వీరి పెళ్లి ధూంధాంగా చేశారు. రీల్ స్టోరీకి ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ రియల్ లవ్ స్టోరీ ఉంది కదూ? ఏమంటారు?