మండలి రద్దుకు సభ ఆమోదం..133 ఓట్లు!

Mon Jan 27 2020 19:35:06 GMT+0530 (IST)

Andhra Assembly passes resolution seeking to abolish state Legislative Council

ఏపీ శాసనమండలి రద్దుకు ఏపీ శాసనసభ ఆమోదం పలికింది. ఈ రోజు ఉదయం ఏపీ కేబినెట్ శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇదే రోజు శాసనసభలో చర్చ జరిగింది. మండలి రద్దు గురించి ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో మండలి రద్దుకు అనుకూలంగా తీర్మానం నెగ్గింది.తెలుగుదేశం పార్టీ ఈ చర్చలో పాలు పంచుకోలేదు. సోమవారం సభకు పంగనామం పెట్టింది తెలుగుదేశం పార్టీ. మండలి రద్దును ఆ పార్టీ సమర్థించడం లేదు. మండలి కొనసాగాలని ఆ పార్టీ అంటోంది. అయితే అదే మాటే వచ్చి సభలో మాత్రం చెప్పలేదు తెలుగుదేశం పార్టీ. గతంలో మండలి ఏర్పాటు అయినప్పుడూ తెలుగుదేశం దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు మండలి రద్దునూ తెలుగుదేశం వ్యతిరేకిస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ శాసనసభకు హాజరు కాలేదు.

దీంతో సభలో ఏకగ్రీవంగా మండలి రద్దు తీర్మానం ఆమోదించబడింది. శాసనసభలో ఏకైక ఎమ్మెల్యేతో ఉన్న జనసేన కూడా మండలి రద్దుకు ఓకే చెప్పింది. ఆ పార్టీ ఎమ్మెల్యే మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారు. అధికార పార్టీ అనుకూలంగా ఉండటంతో మండలి రద్దు తీర్మానం మరోమాట లేకుండా ఆమోదం పొందింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వివిధ వ్యక్తిగత కారణాలతో పలువురు సభకు హాజరు కాలేదు. దీంతో మండలి రద్దుకు అనుకూలంగా 133 మంది ఓట్లు వేశారు. మండలిలో సభ్యులుగా మంత్రులుగా ఉన్న మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోస్ లను ఒక పక్కగా కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని ఆదేశించారు.