Begin typing your search above and press return to search.

ఆ వృద్ధ దంపతులతో భారత్ ప్రత్యేకత చాటిన ఆనంద్ మహీంద్రా.. థాంక్స్!

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:42 AM GMT
ఆ వృద్ధ దంపతులతో భారత్ ప్రత్యేకత చాటిన ఆనంద్ మహీంద్రా.. థాంక్స్!
X
ఎంత గొప్ప విషయమైనా కానీ.. దాన్ని చెప్పేవారు చెబితే వచ్చే విలువ లెక్కే వేరుగా ఉంటుంది. ప్రముఖులు పరిచయం చేసినప్పుడు దానికి ప్రజల నుంచి ఉండే అటెన్షన్ ఎక్కువని చెప్పక తప్పదు. బిజినెస్ లో ఎంత దూకుడుగా ఉంటారో.. సోషల్ మీడియాలో అంతకు మించిన చురుకుదనం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సొంతంగా చెప్పాలి. తన ఉత్పత్తులకు తానే ఒక వాల్యూ యాడెడ్ గా వ్యవహరించే ఆయన.. ఆసక్తికరమైన పోస్టుల్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఆయన పుణ్యమా అని.. ఎంతో మంది రాత్రికి రాత్రి పాపులర్ కావటమే కాదు.. వారు పడిన శ్రమ ప్రపంచానికి తెలియటమే కాదు.. వారి సామర్థ్యం సరికొత్త అవకాశాన్ని సొంతం చేసుకునేలా చేసింది. ఆ విషయంలో ఆనంద్ మహీంద్రాను ప్రత్యేకంగా అభినందించాల్సిందే.

పంద్రాగస్టు వేళ జెండా ఎగురవేయటం మామూలే అయినా.. వజ్రోత్సవ వేళ.. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు యావత్ దేశం ఎలా కదిలిందో అందరూ చూసిందే. అయితే.. మనం చూసిన భారతానికి మించి మరెన్ని విశేషాలు చోటు చేసుకున్న వైనాన్ని సోషల్ మీడియా కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అలా తన వరకు వచ్చిన ఒక ఆసక్తికర పోస్టును ఆనంద్ మహీంద్రా పోస్టు చేశారు.

అమృతోత్సవాల్లో భాగంగా ఒక పేద వృద్ధ దంపతులు తమ రేకుల ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసేందుకు పడిన కష్టం ఎంతన్న విషయాన్ని తన పోస్టుతో చెప్పేశారు. సదరు వృద్ధ మహిళ.. ఇనుప డ్రమ్ము మీద నిలబడగా.. అది కదలకుండా ఉండేందుకు వృద్ధుడైన ఆమె భర్త సాయంగా నిలిచిన ఫోటోను చూసినంతనే ఒక్కసారిగా భావోద్వేగం కమ్ముకోవటమే కాదు.. ఇలాంటివి మన దేశంలో మాత్రమే కనిపిస్తాయని చెప్పక తప్పదు.

ఈ ఫోటోను షేర్ చేసిన ఆయన.. ఈ ఫోటోకు తగ్గట్లే దానికో కామెంట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఇంత హడావుడి ఎందుకు చేస్తారని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఈ ఇద్దరిని అడగండి. గొప్ప గొప్ప వక్తలు చెప్పే ఉపన్యాసాల కంటే అద్భుతంగా వారు మీకు వివరిస్తారు. జైహింద్’ అంటూ రాసుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావటమే కాదు.. కోట్లాది మంది మనసుల్ని టచ్ చేసింది. ఈ వృద్ధ దంపతుల దేశభక్తికి ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోను తన సోషల్ ఖాతాలో షేర్ చేయటం ద్వారా.. భారత్ విలక్షణతను ప్రపంచానికి చాటినందుకు ఆనంద్ మహీంద్రాకు సైతం థ్యాంక్స్ చెప్పాల్సిందే. అత్యాశ కాకుంటే.. ఈ వృద్ధ దంపతుల్ని ప్రధానమంత్రి మోడీ పిలిచి.. వారితో మాట్లాడి.. వారి దేశభక్తికి ఎంతలా ఉప్పొగిందో చెబితే మరెంత బాగుంటుందో కదా?