రోటీన్ కు భిన్నంగా ఆనంద్ మహీంద్రా జోకులేస్తే ఇలానే ఉంటాది

Wed May 25 2022 10:51:06 GMT+0530 (IST)

Anand Mahendra Jokes in Online

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అది ఇది అన్న తేడా లేకుండా అన్ని అంశాల మీదా తన అభిప్రాయాన్ని షేర్ చేసే అతి కొద్ది పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా మొదటి వరుసలో ఉంటారు.నిజం చెప్పాలంటే.. సోషల్ మీడియాలో ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మహీంద్రా కంపెనీ మీద అభిమానం చాలామందికి రెట్టింపు కావటమే కాదు.. ఆయనకు.. ఆయన పోస్టులకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయిన పరిస్థితి. స్ఫూర్తివంతమైన కథనాలు.. రోటీన్ కు భిన్నంగా.. చూసినంతనే 'ఔరా' అనేలాంటి అంశాల్ని అందరితో షేర్ చేసుకునే ఆయన.. తాజాగా సరదాగా జోక్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఒక నెటిజన్ వేసిన జోక్ కు.. ఆయన అదే రేంజ్ లో ఫన్నీగా రిప్లై ఇవ్వటం.. అది కాస్తా బ్లాక్ బస్టర్ కావటం గమనార్హం. ఇంతకూ అసలేం జరిగిందంటే.. స్కార్పియో - ఎన్ పేరుతో మహీంద్రా కంపెనీ తాజాగా ఒక కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని.. వీడియోల్ని పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో మహీంద్రా పోస్టును ట్యాగ్ చేసిన ఒక నెటిజన్ సరదాగా రియాక్టు అయ్యారు. ఈ కొత్త వాహనాలతో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి ఒక యాక్షన్ సీక్వెల్ ప్లాన్ చేస్తాడనే అర్థం వచ్చేలా ఆయన పోస్టు ఉంది. లవ్ ట్రాకుల్ని ఎంత అందంగా తీయగలరో.. అంతే భారీగా యాక్షన్ ట్రాకుల్ని తీసే బాలీవుడ్ డైరెక్టర్ గా గుర్తింపు ఉన్న రోహిత్ షెట్టి ప్రస్తావనకు.. ఆనంద్ మహీంద్రా అంతే స్పోర్టివ్ గా రియాక్టు అయ్యారు.

తన సహజ శైలికి భిన్నంగా కాస్తంత ఫన్నీగా రియాక్టు అయ్యారు. 'రోహిత్ శెట్టి జీ' అంటూ సంబోధిస్తూ.. 'ఈ వాహనాన్ని పేల్చాలంటే రోహిత్ శెట్టికి అణుబాంబు అవసరం పడుతుంది' అంటూ రీట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చతురతకు సోషల్ మీడియా ప్లాట్ కావటమే కాదు.. పలువురు పాజిటివ్ గా రియాక్టు అవుతున్నారు.

ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామికవేత్తకు మిగిలిన వారికి తేడా ఏమంటే.. సందర్భానికి తగినట్లు వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవటమే కాదు..  సోషల్ మీడియాలో ఎలా రియాక్టు కావాలన్నది ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో?