వైసీపీకి సౌండ్ లేకుండా చేసిన ఆనం ..అగ్గి రాజేశారుగా!

Sun Mar 26 2023 13:45:05 GMT+0530 (India Standard Time)

Anam Ramanarayana Reddy Comments On Jagan

వైఎస్ జగన్. సొంత పార్టీ వారి నుంచే దారుణమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారంటూ నలుగురి వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు జగన్. ఇపుడు వరసబెట్టి వారంతా జగన్ మీద రివర్స్ లో అటాక్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దాయన ఆనం రామనారాయణరెడ్డి అయితే జగన్ని చాలా మాటలు అనేశారు.



ఇలాంటి సీఎం ని నా రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదు అన్నారు. వైఎస్సార్ ఎంతటి ప్రజాస్వామ్య వాదో జగన్ అంతటి అప్రజస్వామికవాది అని భారీ తేడానే చూపించారు. జగన్ కి భజనపరులు కావాలి కానీ నాయకులు కాదని మరో మాట అన్నారు. అవినీతిపరులను చుట్టూ పెట్టుకుని నాలాంటి వారిని కంట్రోల్ చేయాలని చూశారనీ అనం మండిపడ్డారు.

ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయని ఆయన సూటిగా ప్రశ్నించారు.  సజ్జల ఒక సాధారణ విలేకరి నుంచి ఇంతలా ఎలా ఎదిగారో చెబుతారా అని ఆయన నిలదీశారు. సజ్జల అవినీతి మీద మాట్లాడితే స్వయంగా జగన్ ఫోన్ చేసి అలా మాట్లాడొద్దు అని తనకు చెప్పడాన్ని ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు.

తాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాడిని అని ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ లాంటి సీఎం ని ఎక్కడా చూడలేదని అన్నారు. ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేని పార్టీ వైసీపీ అని అన్నారు. అలాంటి పార్టీతో ఇన్నాళ్ళూ ఉండడమే తన తప్పు అన్నారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా ఒక ఇంచార్జిని పెట్టారని నాటి నుంచే తాను పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాను అని ఆయన అన్నారు.

తన మానాన తాను ఉంటే కోరి కెలికి అగ్గి రాజేసిందే వైసీపీ అధినాయకత్వం అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రోజు ఆనం ఓటుని పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పిన సజ్జల ఆ మరుసటి రోజు తనను ఎలా క్రాస్ ఓటింగ్ అని సస్పెండ్ చేస్తారని ఆనం ప్రశ్నించారు. తనను ఓటే అడగని వారు ఈ రోజు తాను పార్టీ లైన్ దాటానని ఎలా అంటారని ఆయన లాజిక్ పాయింట్ లాగారు.

అయినా తానే క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డాను అని ఎలా చెబుతారు అని ఆయన నిలదీశారు. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆయన నిగ్గదీశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి మీద సమస్యల మీద తాను మాట్లాడితే తప్పు అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో తప్పు జరిగినా మాట్లాడవద్దు అనే హక్కు ఎవరిచ్చారని ఆయన అంటున్నారు.

తాను  ప్రశ్నించే వాటిలో తప్పులు ఉంటే ఎవరైనా సరిదిద్దుకుంటారని ఆయన అన్నారు. వైసీపీలో మాత్రమే వెలి వేస్తారని ఆయన మండిపడ్డారు. తాను టీడీపీలో కూడా సమస్యలు చెబితే వినేవారు పరిష్కారం చూపేవారని వైసీపీలోనే ఇలా చేశారని నిందించారు. తాను పుట్టిందే టీడీపీలో అని అందువల్ల తన భవిష్యత్తు కార్యక్రమాన్ని తాను నిర్ణయించుకోగలను అని ఆయన అన్నారు.

తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని కోర్టు కేసులను సెటిల్ చేసుకోవడానికో కుటుంబ సభ్యులను హత్యలు చేయడానికో రాలేదంటూ ఇండైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ నే ఆనం చేశారు. వైసీపీ ఇదే తీరున వెళ్తే మాత్రం కష్టమని ఆయన అన్నారు. వైసీపీ నేతలు చక్రవర్తులు కారని సామ్రాజ్యనేతలు అంతకంటే కారని ఆనం చురకలు అంటించారు

తన గురించి విమర్శలు చేయడానికి సజ్జల ఎవరని ఆయన నిలదీశారు. ఆయనకు ఆ స్థాయి లేనే లేదని అంటూ ఆనం వైసీపీ సర్కార్ కి దారుణమైన పరాభవమే అని శాపనార్ధాలు పెట్టారు. ఏపీలో ప్రజలు ఎన్నుకున్న వారితో పాలన సాగడంలేదని రాజ్యాంగేత శక్తి పాలన సాగుతోందని ఆయన దుయ్యబెట్టారు. తన మీద కుట్రలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడంతోనే వైసీపీ పతనం చెందిందని ఆయన అంటూ ఇలాంటి పార్టీలో ఉండడం కంటే దూరం జరగడమే మేలు అన్నారు. మరి వైసీపీకి సౌండ్ లేకుండా చేసిన ఆనం ఆరోపణలు ఆ పార్టీ ఎలా జీర్ణించుకుంటుందో చూడాల్సి ఉంది.