ఇంత జరిగినా వెనక్కి తగ్గని వైసీపీ ఎమ్మెల్యే.. మరోసారి హాట్ కామెంట్స్!

Tue Jan 31 2023 15:02:48 GMT+0530 (India Standard Time)

Anam Ramanaraya Reddy made sensational comments

ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలం వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబానికి ఉన్న చరిత్ర సీనియర్ గా ఉన్న తనను మంత్రివర్గ విస్తరణలో పరిగణనలోకి తీసుకోకపోవడం పార్టీ కార్యక్రమాల విషయంలో తనను అంటీముట్టనట్టుగానే ఉంచడం ఇవన్నీ ఆనం రామనారాయణరెడ్డిలో అసంతృప్తికి కారణాలంటున్నారు.ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలతో ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి ఇంచార్జిగా తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు. చాలా కాలం వరకు రామ్ కుమార్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు.

2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరినా ఎక్కడా ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి నుంచి తప్పించిన జగన్ ఆ పదవిని రామ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టారు.

మరోవైపు ప్రస్తుతం వైసీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని నుంచి కూడా ఆనంను పక్కనపెట్టారు. వైసీపీ అధిష్టానం ఈ విషయాన్ని ఆనం రామనారాయణరెడ్డికి నేరుగా చెప్పకుండా ఇప్పటిదాకా మీరు అందించిన సాయానికి కృతజ్ఞతలు అంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ద్వారా ఆయనకు తెలియజేసింది. అంటే ఇక నుంచి మీరు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదంటూ ఆనంకు పరోక్షంగా చెప్పేసింది.

అలాగే ఆనంపై వేటు వేయకుండా ఆయనే పార్టీలో నుంచి పోయేటట్టు వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆనం రామనారాయణరెడ్డి భద్రతను కుదించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆనంకు 2+2 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తుండగా.. దాన్ని 1+1కు కుదించడం గమనార్హం. వాస్తవానికి ఈ 1+1 భద్రత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆనంకు ఉంది.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం రామనారాయణరెడ్డికి పెద్దాయనగా పేరుంది. టీడీపీ కాంగ్రెస్ వైసీపీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. ఎన్టీఆర్ వైఎస్సార్ రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో వైఎస్సార్ మరణించాక ముఖ్యమంత్రి పదవికి కూడా ఆనం పేరు వినిపించింది.

అలాంటి ఆనంను తనంతట తానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తుందని అంటున్నారు.

వైసీపీ అధిష్టానం  తనను ఎంతగా రెచ్చగొడుతున్నా ఆనం కూడా ఏమాత్రం తొందరపడటం లేదు. నిదానంగా పావులు కదుపుతున్నారు. మరోమారు వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం అత్యంత బలమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారం ఆధిపత్యం కోసం మూడు వర్గాలు తయారయ్యాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగేతర వ్యక్తులను ఇంచార్జిగా నియమించడం సరికాదన్నారు. తద్వారా ఇటీవల తనను వెంకటగిరి ఇంచార్జిగా తప్పించి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఇంచార్జిగా నియమించడాన్ని ఆనం పరోక్షంగా తప్పుబట్టారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.