Begin typing your search above and press return to search.

అంత పెద్ద కంపను మీద పడకుండా జాగ్రత్త పడ్డ షా

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:30 AM GMT
అంత పెద్ద కంపను మీద పడకుండా జాగ్రత్త పడ్డ షా
X
కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదెంత అంటే రెప్పపాటులో. కాస్త ఉపేక్షించినా జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయంలో తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా వ్యవహరించిన తీరు చూస్తే ముచ్చటేయకమానదు. అనవసరమైన వివాదాల్ని సింఫుల్ గా తప్పించటం ఎలానో తాజా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. కొన్ని సందర్భాల్లో కాస్త కరకుగా వ్యవహరించినట్లు కనిపించినా.. దాని వల్ల లేనిపోని తిప్పలు తప్పుతాయన్నది నిజం. ఆ విషయాన్ని చేతల్లో చూపించిన అమిత్ షా పలువురి మనసుల్ని దోచేశారని చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ. ఇప్పటికే కేంద్రానికి.. రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఏ మాత్రం బాగోలేవన్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు మిత్రుడిగా ఉన్న శివసేన.. ఇప్పుడు ఉప్పు.. నిప్పులా మారిన పరిస్థితి. ఇలాంటివేళ.. దీన్ని మరింత పెంచటమే కాదు.. అనవసరమైన తలనొప్పిని తెచ్చి పెట్టేలా గవర్నర్ లేఖ.. అందులో వాడిన భాష ఉంది. అన్ లాక్ లో భాగంగా బార్లు.. రెస్టారెంట్లు తెరుస్తారు కానీ.. దేవాలయాలు తెరవరా? అన్న ప్రశ్నతో పాటు.. ఆ సందర్భంలో ఆయన వాడిన సెక్యులర్ పదం సంచలనంగా మారింది. కొత్త వివాదానికి తెర తీసింది.

‘‘విచిత్రం ఏమంటే మీరు బార్లు తెరుస్తారు. బీచ్ లు తెరుస్తారు. దేవుళ్లు.. దేవతలను నిరంతరం లాక్ డౌన్ లోనే ఉంచుతున్నారు. మీకేమైనా దివ్య సంకేతాలు అందుతున్నాయా? ప్రార్థనా స్థలాల్ని తెరవడాన్ని వాయిదా వేస్తున్నారు? సెక్యులర్ పదాన్ని ఎన్నో ఏళ్లు పాటు ద్వేషించిన మీరు ఆకస్మికంగా లౌకికవాదిగా మారిపోయారా?’’ అంటూ గవర్నర్ రాసిన లేఖ పెను దుమారానికి కారణమైంది. శివసేన సర్కారు ఈ లేఖపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు ఘాటు రిప్లై కూడా ఇచ్చారు.

‘‘ఆలయాలు తెరిస్తేనే హిందూత్వం కింద లెక్క. కాదంటే సెక్యులర్ అనా? సెక్యులర్ అనే పదం మన రాజ్యాంగంలోనే ఉంది. దాన్ని కాపాడతామనే మీరు ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని మరొద్దు. మీ నుంచి హిందూత్వంపై పాఠాలు నేర్వాల్సిన పని లేదు. మీ లేఖ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేవిగా ఉంది’’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా బదులిచ్చారు.

ఈ వివాదం ముదిరేలా ఉండటం.. ఇష్యూ అంతకంతకూ పెరిగితే జరిగే నష్టం ఏమిటన్న విషయాన్ని గుర్తించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర గవర్నర్ లేఖను తప్పు పట్టటమే కాదు.. ఆయన వాడిన భాష ఏ మాత్రం సరికాదని తేల్చేశారు. సంయమనం పాటించాల్సిందన్న మాటను చెప్పటం ద్వారా.. వివాదాన్ని రాజీ ధోరణిలో సెటిల్ చేసుకుందామన్న సంకేతాల్ని పంపారు.

అమిత్ షా స్పందనను గుర్తించిన శివసేన.. ఆయన వ్యాఖ్యల్ని స్వాగించింది. గవర్నర్ లేఖను తప్పు పట్టటం హర్షణీయమని.. వివాదం ముగిసినట్లేనని తేల్చేయటం ద్వారా అమిత్ షా మాటల్ని తాము గౌరవిస్తున్న వైనాన్ని చెప్పకనే చెప్పేశారు. కొన్ని అనవసరమైన వివాదాలకు ఎలా చెక్ చెప్పాలన్న విషయాన్ని అమిత్ షా స్పందించిన తీరుతో స్పష్టమవుతుంది. అంతేకాదు.. ఇష్యూను ఇష్యూలా టేకప్ చేసి.. ఎప్పుడైతే రాజీ సంకేతాల్ని అందటంతో అక్కడితో ఆ విషయాన్ని వదిలేసే తీరులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ సైతం పరిణితి ప్రదర్శించారని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. అనవసరంగా మీద పడే కంపను అమిత్ షా ఎంత తెలివిగా తప్పించారో ఈ ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.