ఇదేం పోయే కాలం? కైలాస దేశంతో అమెరికా నగరాల ఒప్పందాలు

Sun Mar 19 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

American cities with the nation of Kailasa

అత్యాచార నేరంలో తీవ్రమైన ఆరోపణలతో భారత్ నుంచి  పారిపోయి.. ఈక్వెడార్ సమీపంలోని ఒక దీవిని కొనుగోలు చేసి.. దానికి కైలాస దేశమని పేరు పెట్టుకోవటం.. రచ్చ చేస్తున్న వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఐక్యరాజ్యసమితో ఆధ్వరంలో జరిగిన సమావేశంలో.. భారత్ మీద విమర్శలు చేసిన సదరు స్వామి సేవకురాలి తీరు కలకలాన్ని రేపింది. ఇదిలా ఉంటే.. తాజాగా నిత్యానందుడి మరిన్ని లీలలు తాజాగా బయటకు వచ్చాయి.తాజాగా ప్రఖ్యాత ఫాక్స్ న్యూస్ మీడియా సంస్థ ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. గుర్తింపు లేని కైలాస దేశంతో అమెరికాలోని పలు నగరాలు ఒప్పందాలు కుదుర్చుకున్న వైనాన్ని బయటపెట్టింది. అమెరికాలోని పలు నగరాల్లో కల్చరల్ పార్టనర్ షిప్ పేరుతో డీల్స్ కుదుర్చుకున్నట్లుగా పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పలు నగరాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నట్లుగా వెల్లడించింది.

ఇటీవల ఇలాంటి డీల్స్ కుదుర్చుకున్న నగరంగా న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ నగరం నిలిచింది. అంతేకాదు రిచ్ మండ్.. వర్జీనియా.. డేటటన్.. ఒహాయా.. బ్యూనా పార్క్.. ఫ్లోరిడా లాంటి దాదాపు ముప్ఫై నగరాలు ఈ గుర్తింపు లేని నకిలీ దేశంతో ఒప్పందాలు జరగటాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. తన తాజా కథనంలో ఈ నగరాల తీరును ఏకి పారేసిన సదరు మీడియా సంస్థ.. ఈ వివాదాస్పద గురువు బోల్తా కొట్టించిన నగరాల జాబితా చాలా పెద్దదే అని పేర్కొనటం గమనార్హం. మరి.. ఇప్పటికైనా నిత్యానందుడి విషయంలో భారత్ కాస్తంత తీవ్రంగా ప్రయత్నిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.