Begin typing your search above and press return to search.

అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఎఫ్35బీ.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:05 AM GMT
అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఎఫ్35బీ.. ఏం జరుగుతోంది?
X
అగ్రదేశం అమెరికా, రష్యా దేశాలు తమ ఆయుధ సంపత్తి పట్ల చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తాయి. ఆయుధాల రహస్యాలను కాపాడుకోవడానికి ఎదుటి దేశాలతో వైరానికి కూడా సై అంటాయి.

అలాంటి నేపథ్యంలోనే ఓ యుద్ధవిమానం శకలాలు అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కూలిపోయిన ఈ యుద్ధ విమానం కోసం అగ్రదేశం నానా హైరానా పడుతోంది. అయితే దీనికోసం కాపలాకాస్తుండడం గమనార్హం. అయితే కూలిన యుద్ధ విమానం కోసం ఇదంతా అవసరమా? అంటే చాలా అవసరం. దేశంలోని ఆయుధ సంపత్తి అంత ముఖ్యం మరి.

పైగా అత్యంత టెక్నాలజీతో ఉపయోగించిన ఆయుధాలను చాలా భద్రంగా ఉంచుకోవడానికి అమెరికా ఎప్పుడూ తన సాయశక్తులా కృషి చేస్తూనే ఉంటుంది.

ఆయుధంలోని రహస్యాలు ఎవరికీ దక్కకూడదనే కారణంతోనే నాటో కూటమిలోని సభ్యదేశమైన టర్కీతో అమెరికా వైరం పెట్టుకుంది. ఇక ఇది రష్యా చేతికి చిక్కకూడదని నానా ప్రయత్నాలు చేస్తోంది.

అదే ఎఫ్ 35 యుద్ధ విమానం. అత్యంత అడ్వాన్స్ డ్ సాంకేతికతతో దీనిని తయారు చేశారు. బ్రిటన్ కు చెందిన క్వీన్ ఎలిజబెత్ వాహక నౌక నుంచి ఎఫ్35బీ యుద్ధవిమానం అక్టోబర్ లో మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. దాని శకలాలు సముద్రగర్భంలోకి పడిపోయాయి. ఈ విషయాన్ని రాయల్ నేవీ, ఈ విమాన ఎజెక్షన్ సీట్లను తయారు చేసిన మార్టిన్ బేకర్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించాయి.

ఈ ప్రమాదం నుంచి ఫైలట్ డ్యామ్ బస్టర్స్ స్వాడ్రన్ సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కూలిన ఎఫ్35బీ యుద్ధ విమానంలో చాలా ప్రత్యేకతలు దాగి ఉన్నాయని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని వంద మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి తయారు చేశారు. ఇది హెలికాప్టర్ వలె నిట్టనిలువునా ఎగరగలదు. ఎక్కడైనా ల్యాండ్ అవగలదు. అనేక ఇతర ఫీచర్లతో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.

అయితే వర్షాల నుంచి రక్షణ కోసం కవర్ ను డిజైన్ చేశారు. దానిని ఇంజిన్ లోపలకు లాక్కోవడం వల్ల ఈ యుద్ధవిమానం కూలిపోయినట్లుగా రాయల్ నేవీ అంచనా వేసింది. అయితే ప్రమాదం జరగగనే అమెరికా అప్రమత్తమైంది. శకలాల కోసం గాలింపు ముమ్మరం చేసింది. ఎక్కువ బరువు ఉన్న శకలాలు సముద్రగర్భంలోకి చేరుతాయి. అయితే సముద్రంలోపల శోధించాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేక టెక్నాలజీ అవసరం.

యుద్ధవిమానం శకలాల వెలికితీత కోసం అమెరికా ఆగమేఘాల మీద ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక టెక్నాలజీ కోసం మిత్ర దేశాల సాయం కోరింది. కాగా దాదాపు రెండు వారాలకు పైగా శోధనలు జరపగా... శకలాలు ఉన్న ప్రదేశాలను గుర్తించగలిగారు. అయినా కూడా వాటిని వెంటనే బయటకు తీయలేకపోతున్నారు.

ఇలా ఆలస్యం అయితే రష్యన్లు ఎక్కడ తమ టెక్నాలజీని తస్కరిస్తారోనని అమెరికాలో గుబులు మొదలైందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కోల్డ్ వారు సమయంలో ఇరు దేశాలు సముద్రగర్భాల సాంకేతికతను అభివృద్ధి చేశాయని తెలిపారు. పైకి జలాందర్గాము కోసం సాయం అని చెబుతూ కోవర్టు ఆపరేషన్లు కూడా జరిపాయని పేర్కొంటున్నారు.

అమెరికాకు చెందిన బీ-52 బాంబరు విమానం నాలుగు థర్మో న్యూక్లియర్ బాంబులతో ప్రయాణిస్తూ 1966లో ట్యాంకర్ విమానాన్ని ఢీకొంది. ఈ ఘటన స్పెయిన్ సమీపంలోని పాలొమరెస్ వద్ద జరిగింది.

అయితే ఆ శకలాల కోసం అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. వాటిని వెలికితీసేందుకు ముప్పుతిప్పలు పడింది. అణుబాంబుల వల్ల కొన్ని ప్రాంతాల్లో రేడియన్ కూడా వచ్చింది. ఎన్ ఆర్-1 పేరుతో మినీ జాలాంతర్గామిని అమెరికా అభివృద్ధి చేసింది. అణుశక్తితో నడిచే ఇది... సముద్రగర్భంలోని శకలాలను వెలికితీయగలదు. ఈ విధంగా ఛాలెంజర్ స్పేస్ షటిల్ భాగాలను గుర్తించింది.

ఇకపోతే రష్యా సబ్ మెరైన్ కె-129 మునిగిపోయింది. దీని టెక్నాలజీని సొంతం చేసుకోవడం కోసం అమెరికా ప్రయత్నించింది. 1971లో ప్రాజెక్ట్ అజోరియన్ అనే ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం రష్యా కూడా లోషారిక్ అనే సబ్ మెరైన్ ను రూపొందించింది. దీని సాయంతో సముద్ర గర్బంలోని కార్యకలాపాలు, ఇంటర్ నెట్, అండర్ వాటర్ కేబుళ్లపై నిఘా వంటి వాటికోసం వాడేది.

అయితే 2019లో ఇది సముద్రగర్భంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 14మంది నావికులు సజీవ దహనమయ్యారు. రష్యా ప్రస్తుతం బెస్టర్ డీప్ సీ రెస్కూ వెహికల్ ను అభివృద్ధి చేసింది. కూలిపోయిన విమానాల శకలాలను సముద్రపు అడుగు భాగంలోనూ ఇది గుర్తించగలదు. ఇదే అమెరికాను ప్రస్తుతం భయపెడుతోంది. గతంలో చైనా ఇలాంటి పనే చేసింది. అందుకే ఎఫ్-35బీ శకలాలను సేకరించి రహస్యాలను తస్కరిస్తుందని ఆందోళన చెందుతోంది.