మన ప్రభుత్వంలో చచ్చిపోతే.. అంబులెన్సులు అందుబాటులో ఉండవా జగన్?

Fri Mar 31 2023 09:44:38 GMT+0530 (India Standard Time)

Ambulance Services In Andhra Pradesh

'ఇది మీ బిడ్డ ప్రభుత్వం. మన ప్రభుత్వం. మీరు ఆదరించి.. అందలం ఎక్కించిన పదవి. నా ముఖ్యమంత్రి  పదవి మీదే. మీ బిడ్డను.. మన ప్రభుత్వాన్ని ఆదరించమని.. ఆశీర్వదించమని కోరుతున్నా' అంటూ జీరబోయిన గొంతుతో అదే పనిగా స్వరాన్ని పెంచి మరీ పదే పదే కోరుకునే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు.. చేతలకు పొంతన లేని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.మైకు అందుకున్నంతనే 'మీ బిడ్డ.. మన ప్రభుత్వం' అంటూ మాటలు చెప్పే ముఖ్యమంత్రి జగన్ మాటల్ని విన్నంతనే కొండంత భరోసాగా అనిపిస్తుంటుంది. కానీ.. చేతల విషయానికి వస్తే మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాల్ని వారి ఊళ్లకు తరలించేందుకు వీలుగా అంబులెన్సులు లేని కారణంగా.. వందల కిలోమీటర్లు మోటారు సైకిల్ మీద తీసుకెళ్లే దరిద్రపుగొట్టు పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నట్లు? అన్నది ప్రశ్న.

నిరుపేదల సంక్షేమం కోసమే పుట్టినట్లుగా పేర్కొంటూ.. ప్రతి నెలా ఏదో ఒక పథకం పేరుతో వందల కోట్ల రూపాయిల్ని బటన్లు నొక్కి లబ్థిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పారించే జగన్ సర్కారులో.. అదే నిరుపేదలు ఆసుపత్రుల్లో చచ్చిపోతే.. వారి కుటుంబ సభ్యుల డెడ్ బాడీని అంబులెన్సుల్లో తరలించే స్థోమత లేకపోవటం దేనికి నిదర్శనం? వేలాది కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నా.. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎందుకు ఉన్నట్లు? అన్నది పెద్ద ప్రశ్న.

సంక్షేమ ప్రభుత్వం అయినప్పుడు.. మృతదేహాల్ని సైతం తరలించేందుకు వీలుగా అంబులెన్సులు అందుబాటులో లేకపోయిన వైనంపై జనం కోసం నిత్యం తపించే బిడ్డ జగనన్న ఎందుకు స్పందించలేదు? ఎందుకు విచారించలేదు. తన కుటుంబంలోని ఒకరి పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు.. నిత్యం నా ప్రజలు అని చెప్పే జగన్.. మనసు ఎంతలా తల్లడిల్లాలి? దానికి తగ్గట్లు చర్యలు ఉండలి కదా? మరి.. అలాంటివేమీ ఎందుకు జరగటం లేదు? లోపం ఎక్కడ ఉంది జగన్ బాబు? అన్న ప్రశ్న అడుతున్న వారికి సమాధానం ఎవరు చెబుతారు?