Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు

By:  Tupaki Desk   |   28 May 2023 8:08 PM GMT
ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు
X
పదహారో ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కాస్త ముందుగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు టీమిండియా మాజీ ఆటగాడు.. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం తానీ టోర్నీ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు. ట్విటర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే.

త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అందుకు తగ్గట్లే ఆయన రిటైర్మెంట్ ప్రకటన ఉందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన వైసీపీలో చేరనున్నారని చెబుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. . ఇందులో భాగంగా ఈ మధ్యనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన ఆయన.. వైసీపీ అధినేత నుంచి కీలక హామీ పొందినట్లుగా చెబుతున్నారు.

రాజకీయాల్ని పక్కన పెడితే.. 2010లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు.. తొలుత ముంబయి ఇండియన్స్ తరఫు ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 202 మ్యాచ్ లు ఆడిన రాయుడు.. ఏడేళ్ల పాటు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడారు. 2013, 2015, 2017 సీజన్ లో ముంబయి జట్టు విజేతగా నిలిచిన వేళలో అంబటి రాయుడు ఆ జట్టులో భాగస్వామిగా ఉన్నారు. 2018 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకలోకి వచ్చిన ఆయన.. అప్పటి నుంచి చెన్నై జట్టుతోనే ఉన్నారు. తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 4329 పరుగులు సాధించానని ట్వీట్ లో పేర్కొన్నారు. అతడి కెరీర్ లో ఒక సెంచరీ ఉంది.

ఇక.. ముంబయి.. చెన్నై జట్లకు తాను ప్రాతినిధ్యం వహించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ప్రకటించిన రాయుడు.. తన కెరీర్ లో 14 సీజన్లు.. 204 మ్యాచ్ లు.. 11 ప్లే ఆఫ్ లు.. 8 ఫైనల్స్.. 5 ట్రోఫీలు తన కెరీర్ లో ఉన్నాయన్నారు.

ఆరో టైటిల్ సాధిస్తానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన అద్భుత జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుగా పేర్కొన్న ఆయన.. మళ్లీ యూ టర్న్ తీసుకోనని పేర్కొన్నారు.