కరోనా సమస్య ఉన్నట్లు అంగీకరించిన నిమ్మగడ్డ

Thu Oct 29 2020 08:15:12 GMT+0530 (IST)

Ambati Rambabu Fires On Nimmagadda Ramesh

ఒకవైపు స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటునే మరోవైపు కరోనా వైరస్ సమస్య ఉన్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంగీకరించటం విచిత్రంగా ఉంది. మార్చిలో అర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయమై నిమ్మగడ్డ అధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. దాదాపు 11 రాజకీయ పార్టీలు సమావేశానికి హాజరై ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలను చెప్పాయి.మామూలుగా అయితే అన్నీ రాజకీయపార్టీలతో కలిపి సమావేఅశం నిర్వహించటమే ఇప్పటివరకు తెలిసిందే. ఎందుకంటే అంశం ఒకటే కాబట్టి ఏ పార్టీ అభిప్రాయం ఏమిటో మిగిలిన అందరు తెలుసుకునేందుకు వీలుగా అందరితో ఒకేసారి మీటింగ్ పెట్టేవారు. కానీ మొదటిసారిగా  ప్రతి పార్టీతోను విడివిడిగా నిమ్మగడ్డ సమావేశం జరిపారు.   ఈ విషయమై వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు ఆరోపణలు గుప్పించారు. దానికి నిమ్మగడ్డ తరపున ఎలక్షన్ కమీషన్ అధికారికంగా స్పందించింది.

రాజకీయపార్టీలతో విడివిడిగా సమావేశం అవ్వటానికి కారణం కరోనా వైరసే అని చెప్పింది. కరోనా వైరస్ కారణంగానే  అందరితో ఒకేసారి సమావేశం నిర్వహించలేదన్నారు. ఇదే విషయమై అంబటి మాట్లాడుతూ 18 మంది రాజకీయపార్టీల ప్రతినిధులతో ఒకేసారి సమావేశాన్ని కరోనా వైరస్ కారణంగా నిర్వహించలేకపోయినా కమీషన్ రేపు వేలాదిమందితో ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందంటూ మండిపడ్డారు.

కరోనా వైరస్ ఉన్నదని స్వయంగా నిమ్మగడ్డే అంగీకరించిన తర్వాత  ఇక ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమంటూ ఎంఎల్ఏ సూటిగా ప్రశ్నించారు. వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించే విషయంలో సమావేశం పెట్టిన నిమ్మగడ్డ మార్చిలో ఎన్నికల వాయిదా విషయంలో ఎందుకు అభిప్రాయం తీసుకోలేదంటూ నిలదీశారు. స్దానిక సంస్ధల ఎన్నికల పేరుతో  రాష్ట్రంలో ఏదో రకమైన అలజడి తీసుకొచ్చి ప్రభుత్వంపై బురద చల్లాలన్న ప్రయత్నమే తప్ప మరోటి కాదంటూ రాంబాబు ఘాటుగా స్పందించారు.