Begin typing your search above and press return to search.

జనసేనలోకి వైసీపీ ముఖ్య నేత.. ముహూర్తం కూడా ఖరారు!

By:  Tupaki Desk   |   8 Jun 2023 2:34 PM GMT
జనసేనలోకి వైసీపీ ముఖ్య నేత.. ముహూర్తం కూడా ఖరారు!
X
జూన్‌ 14 నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన వారాహి యాత్రను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరికలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ ముఖ్య నేతగా ఉన్న ఆమంచి స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.

ఆమంచి స్వాములు ఎవరో కాదు.. చీరాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ సొంత తమ్ముడు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్‌ ను పర్చూరు నియోజకవర్గ ఇంచార్జిగా వైసీపీ అధినేత జగన్‌ నియమించారు.

2000లో వేటపాలెం మండలం జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమంచి కృష్ణమోహన్‌.. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రధాన శిష్యుడిగా ఎదిగారు. ఆయన ఆశీస్సులతో 2009లో తొలిసారి చీరాల నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఆమంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల ముందు తన తమ్ముడు ఆమంచి స్వాములుతో కలిసి జగన్‌ సమక్షంలో వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్‌ ఓటమి పాలయ్యారు.

మరోవైపు చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ పై గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాల నుంచి పోటీకి మొగ్గు చూపుతూ వచ్చారు. ఆమంచి, కరణం, పోతుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో జగన్‌.. కరణం బలరాంకే చీరాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్‌ ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్‌ ను పర్చూరు నియోజకవర్గ ఇంచార్జిగా పంపారు. అయితే పర్చూరుకు ఆమంచి స్థానికేతురుడు.

ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు. జూన్‌ 12న పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. జూన్‌ 12న మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్‌ కళ్యాణ్‌ పూజలు నిర్వహించనున్నారు. ఆ సమయంలో స్వాములు పార్టీలో చేరనున్నారు.

ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ ను కలిసి ఆమంచి స్వాములు పార్టీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు. వాస్తవానికి చీరాలలో తన నూతన గృహప్రవేశం రోజున పవన్‌ కళ్యాణ్‌ ను ఆహ్వానించి భారీ బహిరంగ సభ పెట్టాలని ఆమంచి స్వాములు ముందు భావించారు. అయితే సమయాభావంతో బహిరంగ సభను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 8న ఆమంచి స్వాములు తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు.

జనసేన నుండి తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆమంచి స్వాములు మీడియాకు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ విధానాలు..ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. పార్టీ టికెట్‌ ఇస్తే పోటీలో ఉంటానని..టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు. చీరాల లేదా గిద్దలూరుల్లో ఎక్కడి నుంచి అవకాశమిచ్చినా పోటీ చేయడానికి స్వాములు సిద్ధమవుతున్నారు.