Begin typing your search above and press return to search.

తప్పు మీడియా దగ్గర పెట్టుకొని రాజకీయాల్ని తిట్టటమా?

By:  Tupaki Desk   |   2 Jun 2023 11:00 PM GMT
తప్పు మీడియా దగ్గర పెట్టుకొని రాజకీయాల్ని తిట్టటమా?
X
ఎవరు తక్కువ తినరుగా? అన్న మాట తరచూ రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల కు సంబంధించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారు. అందుకు భిన్నంగా.. సాపేక్షంగా వ్యవహరిస్తూ న్యూట్రల్ గా వ్యవహరించే సెక్షన్ తక్కువగా ఉంటుంది. గతంలో మీడియాలో ఎక్కువ మంది అలాంటి తీరు ను ప్రదర్శించే వారు. దీంతో.. మీడియా అన్నంతనే ఒకలాంటి రెస్పక్టు ఉండేది. ఎప్పుడైతే.. పార్టీల కు మౌత్ పీసులు గా మీడియా మారిందో అప్పటి నుంచి లెక్కలు తేడా వచ్చేశాయి. మీడియా మీద గౌరవం తగ్గింది.

గతంలో సందర్భానికి అనుగుణంగా.. అప్పటి ప్రజల మూడ్ కు తగ్గట్లుగా మీడియా సంస్థలు తమ వాదనను వినిపించేవి. ఉదాహరణ కు 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని గుర్తు తెచ్చుకుంటే.. నాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అవే ఆఖరి ఎన్నికలుగా ప్రచారం జరిగినవి. ఎందుకంటే.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన.. ఎన్నికల కు ఏ మాత్రం సిద్ధంగా లేరు. అప్పటికే నాన్ స్టాప్ గా తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి గా ఒక వెలుగు వెలిగిపోతున్న చంద్రబాబు ను ఎదుర్కొనటం ఎవరికి సాధ్యంకాదన్న వాదన వినిపించేది.

ఇలాంటి వేళలో.. ఇప్పుడు పచ్చ మీడియా గా ముద్ర వేయించుకున్న కొన్ని మీడియా సంస్థలు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కు ఇచ్చిన ప్రాధాన్యం.. ఆయన మాటల కు ఇచ్చిన విలువ అంతా ఇంతా కాదు. తన వ్యక్తిగత సంభాషణల్లో దివంగత వైఎస్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మీడియా సంస్థలు తన కు మద్దతు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. వారు తనకెంతో సాయం చేశారని చెప్పేవారు. ఇప్పుడు ఇదే మాటను చెబితే.. ఎవరూ ఊరుకోరు. ఒప్పుకోరు. కానీ.. జరిగిన సంఘటనల కు సాక్ష్యంగా చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అలాంటి వైఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత.. తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పు పట్టిన మీడియా కు పెట్టిన పేరు.. ఆ రెండు పత్రికలు. అలా మొదలైన తేడా తర్వాతి కాలంలో తానే సొంతంగా మీడియా సంస్థను ఏర్పాటు చేయటం తెలిసిందే. రాజకీయ పార్టీలు సొంతంగా మీడియా సంస్థల్ని ఏర్పాటు చేయటానికి వైఎస్ పునాది వేస్తే.. టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ కొందరు సీపీఎం.. సీపీఐ పాత్ర ను ప్రస్తావించొచ్చు కానీ.. వారి మీడియా సంస్థల ప్రభావం శూన్యమన్నది మర్చిపోకూడదు.

ఎప్పుడైతే రాజకీయ పార్టీలు సొంతం మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవటం మొదలైందో.. వార్తల్ని రాసే విధానం.. తమ ప్రత్యర్థుల విషయాల్ని కవర్ చేసే విధానం మారిపోయింది. అంతకంతకూ ముదిరిపోయిన ఈ వ్యవహారాల్ని చూసినప్పుడు.. మిగిలిన వారు మడి కట్టుకొని కూర్చోలేరు కదా? న్యాయంగా.. ధర్మంగా పోయిన పాపాని కి తమ శత్రువుల్ని తామే తీసుకొచ్చామన్న భావన లో ఉన్న మీడియా సంస్థలు.. ఒక స్టాండ్ తీసుకోవటం మొదలు పెట్టాయి. దీంతో.. ఇప్పుడు మీడియా ముక్కలు చెక్కలు కావటం.. ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా మాటలు అనేయటం వరకు వెళ్లింది.

ఇదంతా చూసినప్పుడు.. తప్పు అంతా మీడియా దగ్గరే ఉంది.అలాంటప్పుడు రాజకీయాల్ని అనే అవకాశం లేదు కదా? రాజకీయాలు ఎప్పుడో తన విలువను.. విశ్వసనీయతను కోల్పోయాయి. అలాంటప్పుడు రాజకీయాల్ని నిందించటంలో అర్థం లేదు. మారింది మీడియానే. మొదట్లో ఒకలా.. తర్వాత ఇంకోలా. అలాంటప్పుడు రాజకీయాల్ని మీడియా వేలెత్తి చూపించటం వృధా ప్రయాసే కదా.