మాన్సాస్ ట్రస్ట్ భూములన్ని ప్రభుత్వానికే చెందుతాయి .. ఎంపీ కీలక వ్యాఖ్యలు

Tue Jul 20 2021 13:08:31 GMT+0530 (IST)

All Mansas Trust lands belong to the government .. MP Key Comments

మాన్సాస్ ట్రస్ట్… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్. ఉత్తరాంధ్రకే పరిమితమైన ఈ ట్రస్ట్ ఏడాది కాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. మహరాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్… అంటే మాన్సాస్… ఇప్పుడు ఈ ట్రస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర మాజీ మంత్రి ట్రస్టు పూర్వాధ్యక్షుడు పూసపాటి అశోక్ గజపతిరాజును పదవి నుంచి దించేయడం ఎప్పుడో ఆ కుటుంబం నుంచి విడిపోయిన ఉమా గజపతి కుమార్తె సంచైతకు ఆ పదవి కట్టబెట్టడం  సుమారు ఏడాదిన్నర కాలం పాటు జరిగిన ఈ చర్చకు గత నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పెను సంచలనానికి దారితీసింది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా సంచైత నియామకం చెల్లదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రాజకీయ చర్చకు తెరలేచింది. కోర్టు తీర్పు తర్వాత మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా అశోక్ గజపతిరాజు భాద్యతలు తీసుకున్నాడు.ఇకపోతే విజయనగరం మహారాజుల మాన్సాస్ ట్రస్టు పరిధిలో సుమారు 14వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోనే కాకుండా గోదావరి జిల్లాల్లోనూ ట్రస్టు భూములు వ్యాపించి ఉన్నాయి. మాన్సాస్ ట్రస్టు కింద చారిత్రక ఎం.ఆర్. కళాశాల పీజీ కళాశాల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల వంటి విద్యా సంస్థలే కాకుండా 105 దేవాలయాలు కూడా ఉన్నాయి. సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి రామతీర్థం దేవస్థానం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు పద్మనాభంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం శ్రీకూర్మం దేవస్థానం వంటి ప్రఖ్యాత దేవస్థానాలున్నాయి. విద్యా సంస్థల నిర్వహణ దేవాలయాల్లో నిత్య దూప దీప నైవైద్యాల కోసం అప్పట్లో కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు వేలాది ఎకరాల భూములను ట్రస్టుకు అప్పటి సంస్థానాదీశుడు పి.వి.జి.రాజు రాసిచ్చేశారు.

ఇదిలా ఉంటే .. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారం పై  విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ కింద ఉన్న వేలాది ఎకరాల భూములు అన్నీ కూడా ప్రభుత్వానివేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదెలా అంటే 45 సంవత్సరాల క్రితం మాన్సాస్ సంస్థ భూములను విజయనగరం జిల్లా కోర్టు ప్రభుత్వానికి అప్పజెప్పాలని కోర్టు తీర్పులో ఉందని కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ జరగలేదని ఆయన తెలిపారు. అలాగే మాన్సాస్ సంస్థ భూములు అమ్మకాలు కొనుగోలు తనఖాలు చేయరాదని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉందని అయినప్పటికీ కూడా కొన్ని భూములు అమ్మకాలు జరిగాయని బెల్లాన చంద్రశేఖర్ ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఈ భూములన్నీ పేద ప్రజలకు ప్రభుత్వానికి చెందాలని ఆయన పేర్కొంటూ వాటిని సాగు చేసే రైతులకు హక్కు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మరో వైపు వామపక్షాలకు చెందిన నాయకులు ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకి ఈ ట్రస్ట్ వివాదం ముదిరి పాకాన పడుతున్న సమయంలో ఇలాంటి సంచలన నిర్ణయాలు ఏమైనా చోటు చేసుకుంటాయా అన్న డౌట్లు అయితే చాలా మందిలో ఉన్నాయి.

మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ ట్రస్ట్ ను పూసపాటి వంశీయులైన పూసపాటి విజయరామ గజపతి (పీవీజీ) రాజు 1958లో ప్రారంభించారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌గానూ ఆయన కుమారులైన ఆనంద గజపతి రాజు అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పీవీజీ మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడు అనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆనంద గజపతి రాజు మరణించడంతో అశోక్ గజపతి రాజు ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 14800 ఎకరాల భూమి మాన్సాస్ ట్రస్ట్ పేరిట ఉంది. ఈ భూముల విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

ఆనంద గజపతి రాజు మరణానంతరం ఆయన సోదరుడు అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అప్పటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన కుమార్తె అదితి గజపతిరాజును మరో ఇద్దరు ఆర్థిక నిపుణులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించింది. కానీ గత ఏడాది సడెన్ గా ఆనంద గజపతి రాజు రెండో కుమార్తె సంచయితను ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజును తప్పించి సంచయితకు ఆ పదవిని అప్పగిస్తూ జీవో జారీ చేసింది. అలాగే ఆనంద గజపతి రాజు కుమార్తె ఊర్మిళా గజపతి రాజు పీవీజీ రాజు కుమార్తె ఆర్వీ సునీతా ప్రసాద్ అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి విజయలక్ష్మి అరుణ్ కపూర్ విజయ్ కె. సొంది విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను బోర్డు సభ్యులుగా నియమించింది.

అయితే దీనిపై అశోక్ గజపతి రాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్ట్ కావడంతో పెద్ద వారికే ట్రస్ట్ చైర్మన్ గా ఉండే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు పేర్కొన్నారు. కానీ నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తాజాగా ఈ ఉత్తర్వులను కొట్టేసింది. సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా నియమించిన తర్వాత గజపతి రాజుల కుటుంబంలోని వివాదాలు రచ్చకెక్కాయి.