Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ తర్వాత అల్లకల్లోలంగా మారిన రష్యా

By:  Tupaki Desk   |   22 Sep 2022 9:34 AM GMT
ఉక్రెయిన్ తర్వాత అల్లకల్లోలంగా మారిన రష్యా
X
ఆశ ఉండాలి అత్యాశ ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉండటం తప్పు కాదు.. ఆ స్థానంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం మొదటికే మోసం వచ్చేలా చేస్తుంది. తాజాగా రష్యా అధినేత పుతిన్ విషయంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

ఉక్రెయిన్ ను సొంతం చేసుకోవాలనే ప్లాన్ తో మొదలెట్టినఆయన ప్రయత్నాలు.. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితిని ఆయనకు అనుకూలంగా కంటే ప్రతికూలంగా మార్చటం తెలిసిందే. ఉక్రెయిన్ మీద పట్టు అంతకంతకు కోల్పోతున్న వేళలో.. అసహనంతో పుతిన్ చేసిన తాజా ప్రకటన.. రష్యాలో కొత్త కలకలానికి తెర తీసింది.

ఉక్రెయిన్ లెక్క తేల్చేందుకు మరో మూడు లక్షల మందిని సైనిక దళంలోకి చేర్చుకోవటంతో పాటు.. అవసరమైతే అణ్వాయుధాల్ని సైతం వాడేందుకు వెనుకాడమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు రష్యాల్లో కొత్త కలకలాన్ని రేపటమే కాదు.. అదెంత అసాధారణ పరిస్థితులకు కారణమైందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారీ మొబైలేజేషన్ కు మొదటిసారి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. పుతిన ప్రకటనకు ప్రపంచం ఉలిక్కిపడింది.

ఇదిలా ఉంటే రష్యాలో మార్షల్ లా విధిస్తారన్న భయాందోళన ఆ దేశంలో నెలకొంది. యుద్ధంలో పాల్గొనేందుకు అర్హత వయసు ఉన్న రష్యన్ యువకులు భయంతో దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన పరిస్థితులు తాజాగా రష్యాలో కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. రష్యా నుంచి విమానాలు బయటకు వస్తున్న వాటి సంఖ్య భారీగా ఉంటోంది. రష్యాలో విమాన టికెట్లు అమ్మే వెబ్ సైట్లలో ప్రముఖంగా చెప్పే 'అవియాసేల్స్' గూగుల్ లో ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉంటే రష్యాలోని మాస్కో.. సెయింట్ పీటర్ బర్గ్ నుంచి విడిచి విమానాల్లో వెళ్లిపోతున్న వారికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎయిర్ ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పే ఈ ఉదంతం చూస్తే.. పుతిన ప్రకటన సొంత ప్రజల్ని సైతం ఎంతటి ఆందోళనకు గురి చేస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అంతేకాదు.. విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటటమే కాదు.. వారం మొత్తానికి సరిపడా టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయినట్లుగా ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇదంతా చూస్తే.. ఉక్రెయిన్ ను సొంతం చేసుకోవాలనుకునే అత్యాశ.. చివరకు సొంత ప్రజలకే వణుకు పుట్టి దేశం విడిచి వెళ్లిపోతున్న వైనం పుతిన్ మైండ్ సెట్ లో మార్పును తెస్తుందో.. మరింత మూర్ఖంగా మారుస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.