Begin typing your search above and press return to search.

ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం .. శాటిలైట్ ఫొటోలు వైరల్

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:31 AM GMT
ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం .. శాటిలైట్ ఫొటోలు వైరల్
X
గత కొద్ది రోజుల ముందు వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలాగే ఉన్న ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్‌ గా అయిన తాలిబన్లు,మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది. తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే ఎంతో నయం అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి వెళ్లిపోదామా అంటూ ఎదురు చూస్తోన్నారు. పొరుగునే ఉన్న తజికిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ తమ సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. ఆప్ఘనిస్తాన్ నుంచి ఎవరినీ రానివ్వట్లేదు.

అదే సమయంలో కాబుల్, కాందహార్, మజర్-ఐ-షరీఫ్, జలాలాబాద్ వంటి సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాల నుంచి వెలుపలికి వెళ్లే రహదారులను తాలిబన్లు బ్లాక్ చేశారు. నగరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సరిహద్దులను దాటుకోవడానికి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్ల ఆప్ఘనిస్తాన్ ప్రజలు విమానాలను ఆశ్రయిస్తోన్నారు. వేలాదిమంది కాబుల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటిదాకా అధికారంలో ఉన్న అష్రఫ్ ఘనీ సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన మరుక్షణం నుంచే వేలాది మంది స్థానికులు దేశం వదిలి వెళ్లడం ప్రారంభించారు. తజికిస్తాన్, ఇరాన్ సరిహద్దులకు చేరుకున్నప్పటికీ వారు దాన్ని దాటుకోలేకపోయారు.

కాబుల్‌లో నివసిస్తోన్న వేలాది మంది హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కనిపించిన విమానాన్ని కనిపించినట్టే ఎక్కేశారు. మరి కొందరు అమెరికాకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం టైర్లు, డోర్లు పట్టుకుని గాలిలో ప్రయాణించడానికి ప్రయత్నించి, ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. వేలాదిమంది ఆప్ఘనిస్తానీయులను నియంత్రించడానికి అమెరికా సైన్యం కాల్పులు సైతం జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. వేర్వేరు ఘటనల్లో 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఈ పరిణామాలన్నింటినీ కళ్లకు కట్టినట్టుగా చూపించాయి కొన్ని శాటిలైట్ ఫొటోలు. అక్కడి దుస్థితికి అద్దం పట్టాయి. మక్సర్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ ఫొటోలను చిత్రీకరించింది. మొత్తం నాలుగు శాటిలైట్ ఫొటోలను ఆ కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ లో పోస్ట్ చేసింది. విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా నిల్చున్న స్థానికులను ఈ ఫొటోల్లో స్పష్టంగా చూడొచ్చు. సోమవారం ఉదయం 10:36 నిమిషాలకు కాబుల్ ఎయిర్ పోర్ట్, అక్కడికి దారి తీసే మార్గాలను చిత్రీకరించినట్లు మక్సర్ టెక్నాలజీస్ తెలిపింది. కాబుల్ ఎయిర్ పోర్ట్‌కు దారి తీసే మార్గాలన్నీ కార్లతో నిండిపోవడాన్ని ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఆప్ఘనిస్థానీయులు విమానాశ్రయానికి గంపులుగంపులుగా చేరుకోవడం కనిపించింది. కాబుల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న మరుక్షణం నుంచి ఆ రోజంతా కాబుల్ ఎయిర్ పోర్ట్ వార్తల్లో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఏరో స్పేస్‌ ను కూడా మూసివేయాల్సి రావడం వల్ల, భారత్ సహా పలు దేశాలకు తరలింపు కార్యక్రమంలో జాప్యం ఏర్పడింది.