బిగ్ బాస్‌కు హైకోర్టు మొట్టికాయలు!

Fri Sep 30 2022 14:16:48 GMT+0530 (India Standard Time)

Advocate Case on Bigg Boss Show

బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అంటూ వచ్చిన బిగ్‌బాస్ ఎంత విజయవంతమైందో తెలిసిన సంగతే. మనదేశంలో ఒక్క హిందీకే పరిమితం కాకుండా తమిళం కన్నడం మలయాళంలతో సహా తెలుగులోనూ ఈ బిగ్ బాస్ సంచలనం సృష్టించింది.  ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఆరో సీజన్ ను రన్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షో ఇతర భాషల్లోనూ పాపులర్ అయిన విషయం తెలిసిందే.బిగ్ బాస్‌లో నటించడం ద్వారా బాగా పేరు సంపాదించి సినిమా అవకాశాలను ఒడిసిపడుతూ పెద్ద సెలబ్రిటీలుగా మారుతున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ షోలో అనవసర వివాదాలతో చెడ్డ పేరు కూడా కొని తెచ్చుకుంటున్నారు.

కాగా బిగ్ బాస్ షోపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. ఈ షోలో అసభ్యత అశ్లీలత పాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు తీవ్ర విమర్శలు ఉన్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వంటివారు ఈ షోపై గతం నుంచే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల సైతం ఆయన బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా బ్రోతల్ హౌస్‌తో పోల్చారు.

రాత్రిపూట ప్రైమ్ టైమ్‌లో కుటుంబం కలిసి టీవీ చూసే టైములో బిగ్ బాస్ షో బోల్డ్ కంటెంట్‌తో ఉంటోందని డబుల్ మీనింగ్ డైలాగులు రోత పుట్టించే అసభ్య సంభాషణలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.

కాగా కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో ఆపేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువయ్యిందంటూ.. అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. షోను వెంటనే ఆపివేయాలని అభ్యర్థించారు. ఈ గేమ్ షో లో అశ్లీలత ఎక్కువగా ఉందని కుటుంబంతో కలిసి చూసేలా లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 30న విచారణ నిర్వహించింది. బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం 1970 లలో వచ్చిన సినిమాల విషయాన్ని ప్రస్తావించింది. మరోవైపు కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు కోర్టును సమయం కోరారు. కాగా ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు తీర్పు ఇచ్చింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.