చంద్రబాబు మీద పోటీ... ఆ హీరో ఏమన్నారంటే...

Fri Jul 01 2022 22:58:55 GMT+0530 (IST)

Actor Vishal Denies Entry Into AP Politics

టీడీపీ అధినాయకుడు చంద్రబాబు రాజకీయ గండరగండడు. ఆయనకు మొదట్లో ఒకసారి ఓటమి చవిచూశారు. కానీ ఆ తరువాత ఆయన ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇక  మేజారిటీలు తగ్గడం పెరగడం అన్నది అప్పటి  ఎన్నికల పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం సొంత స్థావరంగా చేసుకున్నారు. అక్కడ నుంచి ఆయన ఏడు సార్లు పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఎనిమిదవ సారి కూడా గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారు.మరి బాబుని ఓడించే ఆ వీరుడు ఎవరైనా వైసీపీలో ఉన్నారా అంటే ఉన్నారు చాలా మంది అని ఆ పార్టీ జబ్బలు చరుస్తోంది. అయితే ఇటీవల కాలంలో  ఒక హీరో గారి  పేరు రాజకీయ వర్గాలలో వినిపించి పెను సంచలనమే రేపింది. ఆ పేరు ఎవరిదో కాదు తమిళ్ హీరో విశాల్. ఆయన అసలు పేరు విశాల్ రెడ్డి. ఆయన అచ్చమైన తెలుగు కుటుంబానికి చెందిన వారే. ఆయన తండ్రిది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గమే.

కాలక్రమంలో ఆ ఫ్యామిలీ తమిళనాడుకు వెళ్ళిపోయింది. ఇక విశాల్ సంగతి చూస్తే ఆయనకు రాజకీయల మీద ఆసక్తి ఉందని అంటారు. దానికి రుజువుగా ఆయన సినిమా రంగానికి చెందిన ఫెడరేషన్స్ లో పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన తమిళ నటుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో గెలిచి కీలక బాధ్యతలను చేపట్టారు. నిజానికి తమిళ నటులకు రాజకీయ వాసనలు ఉండడం కద్దు.

అది కూడా విశాల్ రెండు రాష్ట్రాలకు చెందిన వారు. దాంతో ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజంగా అలా జరుగుతుందా అన్న ఉత్కంఠ కూడా కనిపించింది. ఎందుకంటే విశాల్ వాళ్ళది సొంత ప్రాంతం కుప్పం కావడం. పైగా వారి చుట్టాలు బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారని అంటున్నారు.

దీంతో పాటు ఈ యువ హీరో తెలుగు వారికి మంచి పరిచయం ఉన్నారు. బలమైన సామాజిక వవర్గం నేపధ్యం ఉంది.  దాంతో అటు సినీ గ్లామర్ కూడా కలసివస్తుంది అనుకున్నారు. కానీ ఈ ప్రచారానికి విశాల్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. తనకు ఏపీ రాజకీయాల మీద అసలు ఆసక్తి లేనే లేదని విశాల్ కొట్టి పారేశారు. అసలు ఈ ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా అర్ధం కాలేదని అన్నారు. తనను కూడా కొందరు అడగడం వల్లనే తాను మాట్లాడాల్సి వస్తోంది అన్నారు.

తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అయితే అసలు లేదు అని పూర్తిగా ఖండించేశారు. ఈ మేరకు విశాల్ ఒక ప్రకటన రిలీజ్ చేయడంతో ఈ ప్రచారానికి చెక్ పడిందనే అనుకోవాల్సి ఉంటుందే. ఏది ఏమైనా ఈ నీలి వార్త కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొట్టి రాజకీయంగా కొంత ఇంటరెస్ట్ అయితే రేపింది అని చెప్పాలి.