హీరో శివాజీకి ఏమైంది?

Sat Mar 06 2021 13:00:01 GMT+0530 (IST)

Actor Shivaji About Chandra Babu

‘ఏరు దాటాక తెప్ప తగిలేయడం’ అంటే ఇదే.. అయినా రాజకీయాల్లో మాట మీద నిలబడే నేత కోసం శూలశోధన చేసినా దొరకరేమో.. హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శివాజీ విషయంలోనూ ఇదే నిరూపితమైంది తాజాగా తేటతెల్లమైంది. ఆయన రెండు మాటలు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన గతంలో చంద్రబాబును తిట్టింది.. ఆ తర్వాత ఎలా ఇప్పుడు పొగుడుతున్నాడో స్పష్టంగా ఉంది. ఈ వీడియోను బేస్ చేసుకొని శివాజీని సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు.గతంలో శివాజీ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా  మాట్లాడేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని.. ఆయన అవినీతి జగన్ కు అడ్వంటేజ్ గా మారిందని శివాజీ ఆ వీడియోలో ఆరోపించారు. దీనిపై తాను ఏపీయే కాదు.. ఎక్కడికొచ్చైనా చెబుతానని శివాజీ తొడగొట్టడం విశేషం. చంద్రబాబు పాలనలో అవినీతి దరిద్రమైన స్థాయిలో ఉందని..  భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఇంత దరిద్రమైన అవినీతి మనం ఎప్పుడూ చూడలేమని చంద్రబాబుపై నిప్పులు చెరిగాడు శివాజీ.. చంద్రబాబు హయాంలో ఇంత ఆర్గనైజిడ్ హైటెక్ అవినీతి జరిగిందని మరీ దారుణం అంటూ వీడియోలో శివాజీ ఆరోపించారు.

ఇక మరో వీడియోలో చంద్రబాబు ‘తెలుగు జాతి గర్వకారణం’ అని ఇదే శివాజీ ప్రశంసలు కురిపించాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడని శివాజీ చెప్పుకొచ్చాడు. ఆయన రేపు అవుతాడో 29లో అవుతాడో.. 34లో అవుతాడో చెప్పలేనని.. కానీ అవుతాడని శివాజీ అన్నారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా కాబట్టి తనకు తెలుసు అని.. అందుకే చంద్రబాబు గెలుస్తాడంటూ శివాజీ కొనియాడారు. జ్యోతిష్యం కాదని.. సర్వే చెప్తున్నానని.. చంద్రబాబు సీఎం అవుతాడని.. సత్యం ఎప్పుడూ అసత్యం కాదని చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశాడు శివాజీ.

ఇలా రెండు నాల్కల ధోరణితో శివాజీ మాట్లాడిన వీడియోపై నెటిజన్లు కామెంట్లు ట్రోల్స్ తో హోరెత్తిస్తున్నారు. శివాజీ అవసరార్థం నాలుక మడతేశాడని ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.