Begin typing your search above and press return to search.

కేంద్రం నిర్ణయంతో అబార్షన్ల సంఖ్య పెరిగే చాన్స్!

By:  Tupaki Desk   |   9 April 2020 3:30 AM GMT
కేంద్రం నిర్ణయంతో అబార్షన్ల సంఖ్య పెరిగే చాన్స్!
X
కరోనా కట్టడి కోసం భారత్ లో విధించన 21 రోజుల లాక్ డౌన్ తో అత్యవసర సేవలందించే రంగాలు మినహా మిగతావన్నీ సేవలను నిలిపివేశాయి. అందుబాటులో ఉన్న పీపీఈలు - మాస్కులు - గ్లౌవ్స్ - సూట్లతో డాక్టర్లు - వైద్య సిబ్బంది...తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలందిస్తున్నారు. చాలామంది వైద్య సిబ్బంది...ఇళ్లకు వెళితే తమవారికి ప్రమాదం అన్న భావనతో ఇళ్లకూ వెళ్లడం లేదు. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ...ఇప్పటికే పలువురు డాక్టర్లు - నర్సులు - వైద్య సిబ్బంది...కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా వైద్య సేవలను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కరోనా విపత్తు సమయంలో లింగ నిర్ధారణ పరీక్షలపై ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. జూన్ 30 వరకు నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై మానవహక్కుల సంఘాలు - సామాజిక కార్యకర్తలు - విపక్షాలకు చెందిన మహిళా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నిబంధనలో సడలింపు వల్ల ఆడపిల్లల భ్రూణ హత్యలు పెరిగిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌ డౌన్‌ వల్ల గృహహింస కేసులు రెట్టింపు అయ్యాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా లింగ నిర్ధారణ పరీక్షలపై సడలింపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి లింగనిర్ధారణ కోసం ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించే క్లినిక్‌ లన్నీ..తమ వద్ద పరీక్షలు చేయించుకున్న గర్భవతుల జాబితాను పక్కాగా నిర్వహించాలి. ఆ జాబితాను స్థానిక ఆరోగ్య అధికారులకు ఎప్పటికప్పుడు సమర్పించాలి. అయితే, కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోవడం - ఆరోగ్య శాఖాధికారులంతా కరోనా కట్టడి చర్యల్లో బిజీగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 30 వరకు ఆ క్లినిక్ లు ఎటువంటి రికార్డులు నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 2015లో 15.6 మిలియన్‌ అబార్షన్లు జరిగాయని లార్సన్ నివేదికనిచ్చింది. ఈ నేపథ్యంలో నిబంధనలు సడలిస్తే...అబార్షన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం సదుద్దేశ్యంతో సడలించిన నిబంధనలను కొన్ని క్లినిక్ లు - కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందని సీపీఎం-ఎల్‌ సభ్యురాలు - అఖిల భారత అభ్యుదయ మహిళా అసోసియేషన్‌ అధ్యక్షురాలు కవితా కృష్ణన్‌ అన్నారు.