Begin typing your search above and press return to search.

ఏవీ సుబ్బారెడ్డికి.. అఖిలప్రియకు చెడింది ఈ ఇష్యూలోనేనా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 1:30 PM GMT
ఏవీ సుబ్బారెడ్డికి.. అఖిలప్రియకు చెడింది ఈ ఇష్యూలోనేనా?
X
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు కానీ శాశ్విత మిత్రులు కానీ ఉండరు. కానీ.. ఇందుకు మినహాయింపుగా కొందరు కనిపిస్తారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కేవీపీ రామచంద్రరావు మధ్యనున్న స్నేహబంధం అంతా ఇంతా కాదు. తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఈ స్నేహబంధం ఒక ఎత్తు అయితే.. కర్నూలు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి దివంగత భూమా నాగిరెడ్డికి.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే ఎవీ సుబ్బారెడ్డికి మధ్యనున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.

ఇరువురు రాజకీయ నేతలే అయినా.. కష్టంలోనూ.. సుఖంలోనూ భూమా నాగిరెడ్డి వెంటే ఉండటం ఎవీ సుబ్బారెడ్డి ప్రత్యేకత. భూమా కారణంగా తాను పెద్దగా ఫోకస్ కాకున్నా.. ఏవీ సుబ్బారెడ్డి పెద్దగా ఫీల్ అయ్యే వారు కాదు. ఆ మాటకు వస్తే.. భూమా కూడా తక్కువేం కాదు. తన ఆస్తిపాస్తుల్లో అత్యధికం ఏవీ చేతుల్లోనే ఉంచుతారని చెబుతారు. వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు మొదలు.. ఆస్తిపాస్తులన్ని ఏవీ పేరుతోనూ.. ఆయనకు చెందిన కంపెనీల పేరుతోనూ ఉంచుతారన్న మాట తరచూ వినిపిస్తుంటుంది.

కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. భూమా నాగిరెడ్డికి.. ఏవీ సుబ్బారెడ్డి బినామీ అనే వారు లేకపోలేదు. ఎవరు ఎన్ని అన్నా.. వారిద్దరి మధ్య స్నేహ బంధం మాత్రం చాలా అరుదైనదని చెప్పాలి. దీనికి తోడు ఏవీ సుబ్బారెడ్డి తీరు కూడా భిన్నం. వివాదాలకు దూరంగా.. అందరిని కలుపుకుపోయే తత్త్వం ఎక్కువ. అనూహ్యంగా భూమా మరణం ఏవీని తీవ్రంగా దెబ్బ తీసిందని చెబుతారు. ఇప్పుడు తమకు తామే నిర్ణయాలు తీసుకుంటున్న భూమా అఖిలప్రియ కావొచ్చు.. మౌనిక.. భూమా కొడుకు జగన్ విఖ్యాత్ రెడ్డి అందరూ ఇదే ఏవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా పెరిగిన వారే.

వాళ్లను ఎత్తుకొని ఆడించిన ఏవీ సుబ్బారెడ్డితో అఖిల ప్రియ అండ్ కోకు ఇప్పుడు రాజకీయ శత్రుత్వం నెలకొని ఉండటం గమనార్హం. భూమా.. ఏవీల మధ్య సంబంధం లక్కా బంగారంలా ఉంటే.. నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీని పక్కన పెట్టటం షురూ చేశారు అఖిల ప్రియ. వారిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? ఎక్కడ తేడా వచ్చిందన్న దానికి ఎవరూ సరైన కారణాన్ని చెప్పేవారు కాదు. వీరిద్దరి మధ్య వైరం.. చివరకు ఏవీ సుబ్బారెడ్డి ప్రాణాలకు ప్రమాదంగా మారిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా తెర మీదకు వచ్చిన హఫీజ్ పేట భూముల ఇష్యూ.. దీనికి సంబంధించినకిడ్నాప్ ఎంత సంచలనంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భూమా అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వైరానికి హఫీజ్ పేట భూములే కారణమన్న మాట వినిపిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి పేరు మీదనే భూములు ఉన్నాయని.. చట్టబద్ధంగా అఖిలప్రియ కుటుంబం పేరు మీద లేవని.. దీనికి సంబంధించిన వాటాల పేచీ పెరిగి పెద్దవై.. చివరకు రాజకీయ శత్రుత్వానికి కారణంగా మారాయని చెబుతున్నారు.