తేల్చుకునేందుకు రెడీ... జగన్ తో ఢీ ?

Wed Dec 01 2021 23:00:02 GMT+0530 (IST)

AP employees Union On AP Govt

ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం పడకేసినట్లే. వారితో పెట్టుకుంటే సర్కార్ బండికి నిండా బ్రేకులు పడినట్లే. ఈ సత్యం పూర్వకాలం నుంచి అందరికీ తెలిసిందే. అందుకే తెలివైన యజమాని పని ముట్టుతో తగవు పెట్టుకోరు అన్న సామెత ఉండనే ఉంది. జగన్ సర్కార్ మాత్రం ఇంతదాకా లైట్ తీసుకుంది. సగం పాలన పూర్తి చేసుకున్న వైసీపీకి సెగలు రేపేలా ఏపీ ఉద్యోగ సంఘాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇక తాడో పేడో అంటున్నారు.ఉద్యమిస్తాం హక్కులు సాధించుకుంటామని నినదిస్తున్నారు. నిజంగా ఉద్యోగ వర్గాలు రెండున్నరేళ్ల పాటు సహనంగానే ఉన్నారని అనుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మొదట ఆరు నెలల పాటు హానీమూన్ పీరియడ్ గా చూస్తారు. జగన్ విషయంలో రెండున్నరేళ్ళు ఓపిక పట్టడం అంటే ఇది మన ప్రభుత్వం అనుకోబట్టే. మొత్తానికి తగ్గుతున్న కొద్దీ  మరింత వెనక్కు పెడుతున్నారు అన్న అనుమానాలు ఏవో ఉండాలి కాబోలు. చివరికి పోరాటమే శరణ్యమని ఉద్యోగ సంఘాలు భావించాయి.

ఉద్యోగుల జేఏసీ అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీస్ ఇచ్చేశాయి. ఇక తాము రోడ్డు మీదకు వచ్చేశామని చెప్పాయి. మొదటి దశలో పోరాటం ఆఫీస్ ముంగిట ఉన్నా ఈ నెల చివరి నాటికి ఉద్యమ రూపం మారిపోతుంది అనే కార్యాచరణ చెబుతోంది. ఏపీవ్యాప్తంగా ఉద్యోగులు మీటింగులతో హోరెత్తించబోతున్నారు.

ఈ నెల అంతా పోరాటాన్ని ఒక మాదిరిగా చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోతే మాత్రం మలిదశ తీవ్రంగానే ఉంటుంది అని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే జీతాల ఆలస్యానికి బాధపడుతున్నారు. డీఏలు ఒకటీ రెండూ కావు ఏకంగా ఏడు విడతలు ఉండిపోయాయి. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ఊసే లేదు. 11వ పీయార్సీ కధ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఇంకా చాలా ఖాళీల భర్తీ లేదు కారుణ్య నియామకాల ఊసే లేదు కరోనా తో మరణించిన వారి ఫ్యామిలీస్ కి ఉద్యోగాలు ఇవ్వాలంటే సర్కార్ పట్టనట్లుంది.

ఇలా చాలా అంశాలతో ఉద్యోగ సంఘాలు ఢీ కొట్టబోతున్నాయి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి ఏపీలో టీడీపీ సహా విపక్షాలను జగన్ సర్కార్ లైట్ తీసుకుంది. అది రాజకీయ పోరాటం. వారు ఎన్ని విమర్శలు చేసినా ఆందోళనలు చేసినా వచ్చే తక్షణ ముప్పేమీ లేదు. ఉద్యోగులతో అలా కాదు వారితో పెట్టుకుంటే ప్రభుత్వ రధానికే అడ్డు పడుతుంది. అసలే అనేక స్కీములతో తెల్లారి లేస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని జోరెత్తిస్తున్న వేళ వారు కనుక సమ్మె రాగం ఆలపిస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ఒక విధంగా జగన్ సర్కార్ కి ది అగ్ని పరీక్ష. ఉద్యోగులతో సామరస్యంగా ఉండాలి చర్చలు జరపాలి. పరిస్థితి చేయి దాటిపోనీయకుండా చూసుకోవాలి.

మరి ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. కానీ వారి డిమాండ్లను తీర్చేందుకు ఖజానా నో చెబుతోందే. అది కదా అసలు పాయింట్. ఆ విధంగా అనుకుంటే మాత్రం జగన్ సర్కార్ సాచివేతకూ  ఉద్యోగుల పోరాటానికి మధ్య లడాయి అనే భావించాల్సి వస్తుంది. మరి ఈ పోరులో ఎవరు నెగ్గేది ఎవరు తగ్గేది అన్నది ఏపీ తెర మీద చూడాల్సిందే.