ఏపీ.. భూముల రీసర్వేకు డ్రోన్లకు బదులుగా ఇవి!

Mon Aug 15 2022 12:00:37 GMT+0530 (IST)

AP.. These are instead of drones for land resurvey!

ఆంధ్రప్రదేశ్లో దాదాపు వందేళ్ల తర్వాత రాష్ట్రమంతా భూముల రీసర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం డ్రోన్లను వినియోగిస్తోంది. ఇలా ఇప్పటివరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 17460 గ్రామాల్లోని 1.22 లక్షల చదరపు కిలోమీటర్లకు గాను.. 4547 గ్రామాల్లోని 25 వేల చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తి చేశారు. మొత్తం 22.43 లక్షల ఎకరాల భూములను కొలిచారు. డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోలను మెరుగు పరిచి ఇచ్చే ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు 2101 గ్రామాలకు సంబంధించ సర్వే బృందాలకు అందాయి.అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం భూసర్వేకు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డ్రోన్‌లు అందించిన ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ (ఓఆర్‌ఐ)లలో అస్పష్టంగా చిత్రాలు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కచ్చితమైన చిత్రాలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డ్రోన్లకు బదులుగా విమానాలను భూసర్వే కోసం వినియోగించాలని నిర్ణయించారు. డ్రోన్లు కేవలం 125 మీటర్ల ఎత్తులోనే ఎగురుతాయని.. అదే విమానాలు అయితే 1500 మీటర్ల ఎత్తు నుంచి తీయొచ్చని చెబుతున్నారు. అందువల్ల భూసర్వేలో డ్రోన్లకు బదులుగా విమానాలు వినియోగించాలని నిర్ణయించారు

ఈ మేరకు ఖచ్చితత్వంలో కూడిన చిత్రాలను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో ఒక విమానాన్ని ప్రయోగాత్మకంగా దించింది. విమానం 1500 మీటర్ల ఎత్తులో తీసిన ఈ ఫోటోలు స్పష్టమైన ఖచ్చితమైన చిత్రాలను ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇలా అధికారులు రోజుకు 200 నుంచి 300 చదరపు మీటర్లకు పైగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ (ఓఆర్‌ఐ)లను పొందగలుగుతున్నారు.

నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఈ ఏరియల్ సర్వే విజయవంతమవడంతో పొరుగున ఉన్న కర్నూలు జిల్లాలో కూడా దీనిని ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత దశలో కృష్ణా ఏలూరు పశ్చిమగోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలకు విస్తరించనున్నారు.

కాగా రీ సర్వే సుమారు వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఈ గ్రామాల్లో 8 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. దీంతో ఆ గ్రామాల్లో కొత్త భూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. జనవరి నాటికి 110 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కాగా ప్రస్తుతం వెయ్యి గ్రామాల్లో పూర్తయిందని చెబుతున్నారు.